సమాఖ్య వ్యవస్థకు కేంద్రం తూట్లు..నిధుల కోతతో రాష్ట్రాలకు తీవ్ర నష్టం: మంత్రి ఉత్తమ్

సమాఖ్య వ్యవస్థకు కేంద్రం తూట్లు..నిధుల కోతతో రాష్ట్రాలకు తీవ్ర నష్టం: మంత్రి ఉత్తమ్
  •     ‘భారత్ సమిట్’లో పలువురు నేతల మండిపాటు 

హైదరాబాద్, వెలుగు: కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. భారత్ సమిట్ కార్యక్రమంలో భాగంగా ‘తెలంగాణ రైజింగ్ కో ఆపరేటివ్ ఫెడరలిజం’ అంశంపై శనివారం నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ లో ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ మధు యాష్కీ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సదస్సులో పలువురు నేతలు, మేధావులు కేంద్ర వైఖరిని తీవ్రంగా విమర్శించారు. డీలిమిటేషన్ పేరుతో లోక్‌‌‌‌సభ స్థానాలను 542 నుంచి 840కి పెంచితే అధికార కేంద్రీకరణ పెరిగి దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా నిలిపేస్తే రాష్ట్రాలు ఎలా ముందుకువెళ్లాలని ప్రశ్నించారు. పంటలకు కేంద్రం పూర్తిస్థాయిలో మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయకపోవడం వల్ల, నిధుల విడుదల ఆలస్యంతో రాష్ట్రాలు బ్యాంకుల నుంచి భారీగా అప్పులు చేయాల్సి వస్తోందని వాపోయారు.

స్వాతంత్ర్యం రాగానే మహిళలకు ఓటు హక్కు: మధు యాష్కీ

మధు యాష్కీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం రాగానే మన దేశం మహిళలకు ఓటు హక్కు కల్పించిందని గుర్తుచేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 'వికసిత్ భారత్' సాధనకు కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం, రాజకీయ వివక్ష లేకపోవడం ఎంతో అవసరమన్నారు. ఝార్ఖండ్ మంత్రి శిల్పి నేహా టిర్కీ మాట్లాడుతూ.. ఎంఎండీఆర్ చట్టం వల్ల తమ రాష్ట్రానికి ఏటా రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని, రూ.1.36 లక్షల కోట్ల బొగ్గు రాయల్టీ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆరోపించారు. రాష్ట్రాల ఆదాయ వనరులను కేంద్రం కట్టడి చేస్తోందని ప్రొఫెసర్ గణేశ్ దేవి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలను కేంద్రీకృతం చేసేందుకు 'కిల్ స్విచ్' వంటి వ్యవస్థలను తెస్తున్నారని రిటైర్డ్ ఐఏఎస్ అదితి మెహతా విమర్శించారు.