- భారీగా డిజిటల్ పరికరాలు, హవాలా పత్రాలు స్వాధీనం
న్యూఢిల్లీ: మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆరు రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. భారీ ఎత్తున డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లతో పాటు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, హవాలా మార్గాల వినియోగాన్ని సూచించే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు శనివారం వెల్లడించారు.
ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ను నవంబర్ 1న ఒమన్ నుంచి భారత్‌కు రప్పించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా అతడు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే గత కొద్ది రోజులుగా బెట్టింగ్ ప్యానెల్ ఆపరేటర్ల ఆఫీసులు, నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టినట్టు సీబీఐ పేర్కొంది. ఈ సోదాల్లో పలుచోట్ల గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న లైవ్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్యానెల్స్‌ను గుర్తించి మూసివేసినట్టు అధికారులు తెలిపారు.
