AP Election: ఏపీలో తొలి దశ పంచాయితీ ఎన్నికలకు ఇవాళ్టి (నవంబర్ 15)  నుంచే నామినేషన్లు..

AP Election: ఏపీలో తొలి దశ పంచాయితీ ఎన్నికలకు ఇవాళ్టి  (నవంబర్ 15)  నుంచే నామినేషన్లు..

ఏపీలో స్థానిక ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ముగియగా.. ఇప్పుడు పంచాయితీ ఎన్నికల వంతు వచ్చింది. నవంబర్ 26న జరగనున్న ఎన్నికలకు ఆదివారం ( నవంబర్ 15 ) నుంచి నామినేషన్లు స్వీకరించనుంది ఎన్నికల సంఘం. 

ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 1295 కేంద్రాలను సిద్ధం చేశారు అధికారులు. జనాభా ప్రాతిపదికన కేంద్రాలు, పంచాయితీల జనాభాను బట్టి నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 

తొలిదశ ఎన్నికల్లో భాగంగా 3వేల 967 సర్పంచ్ స్థానాలకు 40వేల 012 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన, 19 20 తేదీల్లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే వారికి నవంబర్ 21 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు ఇచ్చారు  అధికారులు. నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు అధికారులు.

ఇదిలా ఉండగా.. 23 పట్టణ స్థానిక సంస్థల్లో జరగనున్న ఎన్నికలకు ఇవాళ రెండో రోజు నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. తొలిరోజు 274 నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్, చైర్‌పర్సన్ స్థానాలకు 16 నామినేషన్లు దాఖలు కాగా... డిప్యూటీ మేయర్లు, వార్డులకు 258 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు ( నవంబర్ 16 ) మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఇచ్చారు అధికారులు .