పీజీ డాక్టర్లకు సీజీఎస్ కౌన్సెలింగ్  షెడ్యూల్ విడుదల 

పీజీ డాక్టర్లకు సీజీఎస్ కౌన్సెలింగ్  షెడ్యూల్ విడుదల 
  •     రేపటి నుంచి 22 వరకు ఆన్‌‌‌‌లైన్ వెబ్ ఆప్షన్లకు చాన్స్
  •     డిసెంబర్ 1 నుంచి 5 లోగా రిపోర్టింగ్.. 
  •     నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20 లక్షల వరకు పెనాల్టీ 

 

హైదరాబాద్, వెలుగు: పీజీ డాక్టర్ల కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ (సీజీఎస్)కు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 అక్టోబర్‌‌‌‌లో కన్వీనర్ కోటా కింద పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో పాసైన డాక్టర్లకు సీనియర్ రెసిడెంట్లుగా ఏడాది పాటు ప్రభుత్వ సేవ తప్పనిసరి చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్ లో పోస్టింగ్‌‌‌‌ ల కేటాయింపు కోసం సోమవారం (నవంబర్ 16) ఉదయం 11 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు http://dme.telangana.gov.in వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో (ఎడిట్ ఆప్షన్‌‌‌‌తో సహా) ఆన్‌‌‌‌లైన్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, అక్నాలెడ్జ్‌‌‌‌మెంట్ డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. చివరగా ఇచ్చిన ఆప్షన్లనే ఫైనల్‌‌‌‌గా పరిగణిస్తామని, గడువులోగా ఆప్షన్లు ఇవ్వని వారికి ప్రాధాన్యత ఉండదని, ఖాళీలను బట్టి డీఎంఈ నేరుగా పోస్టింగ్‌‌‌‌లు ఇస్తుందని స్పష్టం చేసింది. కాళోజీ హెల్త్ వర్సిటీ(కేఎన్ఆర్‌‌‌‌యూహెచ్ఎస్) నిర్వహించిన పీజీ ఫైనల్ పరీక్ష మొత్తం మార్కుల మెరిట్ ఆధారంగా పోస్టింగ్‌‌‌‌లు కేటాయిస్తామని, సమాన మార్కులు వస్తే సర్టిఫికేట్ల ప్రకారం వయసులో పెద్దవారికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది.

డిసెంబర్ 5లోగా డ్యూటీలో చేరాలి

పోస్టింగ్ పొందిన అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి 5 లోగా కేటాయించిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, డైరెక్టర్ లేదా డీన్ వద్ద రిపోర్టింగ్ చేసి డ్యూటీలో చేరాలని డీఎంఈ ఆదేశించింది. పాలిక్లినిక్స్ ఎంచుకున్న లేదా కేటాయించబడిన వారు సంబంధిత ప్రిన్సిపాల్స్ వద్ద రిపోర్ట్ చేసి రోస్టర్ ప్రకారం పనిచేయాలి. కేటాయించిన ప్రభుత్వ సంస్థలో చేరకపోయినా, ఏడాది సేవ పూర్తి చేయకపోయినా పీజీ డిగ్రీ అభ్యర్థులు రూ.20 లక్షలు, డిప్లొమా అభ్యర్థులు రూ.10 లక్షలు బాండ్ బ్రేకింగ్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పీజీ డిగ్రీ తర్వాత వెంటనే సూపర్ స్పెషాలిటీలో సీటు పొందిన వారు డీఎంఈ నుంచి ఎన్ఓసీ తీసుకుని, సూపర్ స్పెషాలిటీ పూర్తయ్యాక ప్రభుత్వ సేవ చేయాలి.