- ప్రభుత్వ మద్దతు ధర కంటే తగ్గిన ధరలు
- ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలకు పోటెత్తుతున్న రైతులు
మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో రైస్ మిల్లర్లు ముందుకు రాక ధాన్యం నిల్వకు ఇబ్బందులు కలుగుతున్నాయి. గోదాముల వద్ద పెద్ద సంఖ్యలో ధాన్యం లారీలు బారులుతీరుతున్నాయి. మొన్నటి దాకా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇవ్వడంతో రైతులు తాము పండించిన సన్న ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులు, రైస్ మిల్లర్లకు అమ్ముకున్నారు.
కాగా, ఇప్పుడు మిల్లర్లు సిండికేట్ గా మారి ప్రభుత్వ మద్దతు ధర కన్నా రేట్ తగ్గించడంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. దీంతో మెదక్ జిల్లాలో ధాన్యం రాక వెలవెల బోయిన పీఏసీఎస్, ఐకేపీ, ఏఎంసీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం క్రమంగా పెరుగుతోంది.
434 కొనుగోలు కేంద్రాలు షురూ..
జిల్లా వ్యాప్తంగా 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 434 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కాగా, రైస్ మిల్లర్లు ముందుకు రాకపోవడంతో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లాల్లో 103 రైస్ మిల్లులు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 30 మంది రైస్ మిల్లర్లు మాత్రమే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారు. అందులో అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిన ఆరు మిల్లులకు మాత్రమే సీఎంఆర్ కోసం సివిల్ సప్లై అధికారులు ధాన్యం అలాట్ మెంట్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించడం, అక్కడ వెంటనే ఖాళీ చేసుకుంటే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతుంది.
ధాన్యం తీసుకునేందుకు ముందుకు వచ్చిన రైస్ మిల్లుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో సివిల్ సప్లై అధికారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోడౌన్ లలో నిల్వ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని మండల కేంద్రమైన కొల్చారంలోని మార్కెట్ కమిటీ గోదాములకు తరలిస్తున్నారు.
అక్కడ రెండు గోదాములు ఉండగా ఒక దాంట్లో బియ్యం స్టాక్ ఉండటంతో ధాన్యం నిల్వకు సరిపడా స్థలం లేదు. దీంతోపాటు, హమాలీల కొరత కారణంగా ధాన్యం లారీలు ఆన్ లోడ్ కావడం లేదు. గోడౌన్ ల ముందు మెదక్ –హైదరాబాద్ నేషనల్ హైవే మీద రెండు వైపులా పెద్ద సంఖ్యలో ధాన్యం లారీలు బారులు తీరాయి. ధాన్యం అన్ లోడ్ జాప్యం కారణంగా పడిగాపులు కాయాల్సి వస్తోందని లారీ డ్రైవర్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిస్థితి ఇలాగే ఉంటే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల రైస్ మిల్లర్లతో అగ్రిమెంట్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, లేదా ధాన్యం నిల్వకు మరిన్ని గోదాములను అందుబాటులోకి తీసుకు రావాలని రైతులు కోరుతున్నారు.
