హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూస్తామని, మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లైస్ కమిషనర్ వై.నాగిరెడ్డి హెచ్చరించారు. శనివారం ఎర్రమంజిల్లోని సివిల్స్ భవన్లో ఆయన సివిల్ సప్లయ్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడంతోపాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించడం, నిల్వల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన తూకం, పారదర్శక రికార్డుల నిర్వహణ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
కస్టమ్ మిల్లింగ్ విషయంలో ప్రభుత్వం అప్పగించిన ప్రతి ధాన్యం గింజకూ లెక్క ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మిల్లుల వారీగా పెండింగ్ బకాయిలపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ధాన్యాన్ని పక్కదారి పట్టించడం, తప్పుడు లెక్కలు చూపించడం వంటి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా నిత్యావసర సరుకుల ధరలు, లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ పంపిణీలోనూ అక్రమాలకు తావులేకుండా చూస్తామని స్పష్టం చేశారు.
