- ‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’ అంటూ వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీ పోరాటానికి సంఘీభావం
- భారత్ సమిట్ కార్యక్రమంలో ది పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ నేత కామెంట్
హైదరాబాద్, వెలుగు: దేశంలో లక్షలాది మంది ఓటర్ల తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని ది పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి జియోకోమో ఫిలిబెక్ డిమాండ్ చేశారు. ఓట్ చోర్.. గద్దీ చోడ్ అని వ్యాఖ్యానించారు. దీనిపై కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సిందేనన్నారు. శనివారం భారత్ సమిట్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటు హక్కే ప్రజాస్వామ్యానికి పునాది అని, ‘ఒక్కొక్కరికి ఒక ఓటు’అనే సూత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదని, ప్రజల హక్కులు, రాజ్యాంగ సంస్థలు, పౌరుల గౌరవాన్ని కాపాడటమని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలని, సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్థిక శక్తి ఆధారంగా రాజకీయ ప్రభావాన్ని నిర్ణయించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అసమానతలు, క్లైమేట్ జస్టిస్, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్లో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్న ఫిలిబెక్.. ఆయన నాయకత్వంలో సాగుతున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారని చెప్పారు.
న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు ప్రమాదకరం..
ప్రజాస్వామ్య సంస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తుల పట్ల ప్రజలు మౌనంగా ఉండలేరని ఫిలిబెక్ అన్నారు. ప్రతిపక్ష నాయకులను అణచివేసేందుకు న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. యూరప్, అమెరికా సహా పలు దేశాల్లో న్యాయవ్యవస్థపై ఇటువంటి రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కస్టడీలో ఉన్న మహిళలు, రాజకీయ నాయకులు, ఇతరుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
తుర్కియేలో ప్రతిపక్షాలపై జరుగుతున్న అణచివేతను ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్యం, విద్యా సంస్కరణల కోసం లిబియాలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న వారందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు అండగా నిలవాలని కోరారు. బార్సిలోనాలో జరిగిన గ్లోబల్ ప్రోగ్రెసివ్ మొబిలైజేషన్ (జీపీఎం) సమావేశం ప్రపంచ ప్రగతిశీల ఉద్యమానికి ఒక కీలక ముందడుగుగా మారిందని అభివర్ణించారు. ఆ స్ఫూర్తితోనే హైదరాబాద్ వేదికగా స్పెయిన్లోని పెడ్రో శాంచెజ్, పీఎస్ఓఈ పార్టీకి, అక్కడి ప్రగతిశీల శక్తులకు అంతర్జాతీయ ప్రగతిశీల శక్తుల మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రపంచవ్యాప్తంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని జియాకోమో ఫిలిబెక్ పేర్కొన్నారు.
