జగిత్యాల టౌన్, వెలుగు: అదనపు వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రాగుల శ్రీవిజయ (25)కు నాలుగేండ్ల కింద మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రాగుల వేణుగోపాల్‌తో వివాహమైంది. వీరికి ఒక కూతురు ఉండగా, జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లెలో నివాసం ఉంటున్నారు.
కాగా, అదనపు కట్నం కోసం భర్త వేణుగోపాల్, అతడి కుటుంబ సభ్యులు శ్రీవిజయను తరచూ వేధించేవారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు సజ్జనపు అశోక్ , నీరజ ఫిర్యాదు మేరకు టౌన్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
