కాలువకు భూములివ్వం..గౌరవెల్లి ఎడమ కాల్వ గ్రామసభను బహిష్కరించిన రైతులు

కాలువకు భూములివ్వం..గౌరవెల్లి ఎడమ కాల్వ గ్రామసభను బహిష్కరించిన రైతులు
  •     హుస్నాబాద్​ మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా

హుస్నాబాద్, వెలుగు : గౌరవెల్లి ఎడమ కాలువ డి-4 (13 ఎల్) భూసేకరణ కోసం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్వహించిన గ్రామసభను రైతులు మూకుమ్మడిగా బహిష్కరించారు. అధికారులు మొండి వైఖరి వీడి కాలువ అలైన్‌‌మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ చైర్మన్, పాలకవర్గానికి తమ అభ్యంతరాలతో కూడిన ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామసభలో రైతులు లేకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. 

తమ భూములు కేవలం జీవనాధారం మాత్రమే కాదని, పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పరిస్థితుల్లోనూ భూములు కోల్పోయేది లేదని తేల్చి చెప్పారు. నాళా ఎక్స్‌‌టెన్షన్ ప్లాను, రిజిస్ట్రేషన్ ప్లాట్లు, మున్సిపల్ అనుమతితో నిర్మించుకున్న ఇండ్లు, నేతాజీ నగర్ కాలనీ, కేజీబీవీ విద్యాలయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కాకతీయ కాల్వ తదితర ప్రాంతాల పరిధిలోని భూములు, ఇండ్లను ఈ భూసేకరణ నుంచి రక్షించాలని కోరారు. కెనాల్ నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. కాగా, రైతుల అభ్యంతరాలపై ఆర్డీవో రామ్మూర్తి స్పందిస్తూ కాలువ అలైన్‌‌మెంట్ గతంలోనే ఖరారైందని, ఇప్పుడు రీ-డిజైన్ చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజైన్ మార్చే వరకు తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంతో ఆర్డీవో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో భూముల యజమానులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.