కొండగట్టు, వెలుగు: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొండగట్టు అంజన్న భక్తుల కల నెరవేరనుంది. స్వామివారి ఆలయంలోని మూలవిరాట్ కు సుమారు 60 ఏండ్లుగా పేరుకుపోయిన చందనాన్ని తొలగించే ప్రక్రియ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు ఈనెల 21 నుంచి డిసెంబరు 29 వరకు నిజరూప దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో సుమారు 500 ఏండ్ల కింద స్వయంభువుగా వెలసిన ఆంజనేయస్వామి భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారు. అంతరాలయంలోని మూలవిరాట్‌కు ప్రతి మంగళవారం, శనివారం సహా ప్రత్యేక పర్వదినాల్లో చందనంతో అలంకరిస్తారు. ఇలా ఏండ్ల తరబడి చందనం పూయడంతో స్వామివారి మూలవిరాట్‌పై సుమారు ఆరు ఇంచుల మేర చందనం పేరుకుపోయింది.
దీంతో భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం పూర్తిస్థాయిలో లభించడం లేదు. సుమారు 60 ఏండ్ల కింద కూడా ఇదే విధంగా చందనం పేరుకుపోవడంతో అప్పటి అర్చకులు దానిని తొలగించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆలయ ఆఫీసర్లు, అర్చకులు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
నిజరూపం చూసినారు ముగ్గురే..
60 ఏండ్ల కింద స్వామివారికి మూలవిరాట్‌కు చందనం తొలగించిన సమయంలో నిజరూపం దర్శనం చేసుకున్నవారిలో ప్రస్తుతం ముగ్గురు అర్చకులు మాత్రమే జీవించి ఉన్నారు. వారిలో పెద్ద మారుతి, అనంత స్వామి, తదితరులు ఉన్నారు.
ప్రముఖ నదీజలాలతో అభిషేకం..
చందనోత్సవంలో భాగంగా స్వామివారి మూలవిరాట్‌కు దేశంలోని ప్రముఖ నదులైన కృష్ణా, గోదావరి, గంగా, తుంగభద్ర, కావేరి నదుల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేయనున్నారు. అనంతరం దేవతా వృక్షాలైన మామిడి, జువ్వి, మర్రి, మేడి చెట్లతో తయారు చేసిన ప్రత్యేక పనిముట్ల సహాయంతో మూలవిరాట్‌పై పేరుకుపోయిన చందనాన్ని తొలగించనున్నారు.
ఐదు రోజులపాటు బాలాలయంలోనే దర్శనాలు..
చందనం తొలగింపు ప్రక్రియ నేపథ్యంలో అంతరాలయాన్ని పూర్తిగా చెక్కలతో మూసివేయనున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనే జీయర్లు, రుత్వికులు, అర్చకులు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. ఈ ఐదు రోజులపాటు ప్రధాన ఆలయంలోని గర్భగుడి ఎదుట ప్రత్యేకంగా నిర్మించిన బాలాలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించనున్నారు. ఐదు రోజుల అనంతరం ఈనెల 21 నుంచి స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
అదృష్టంగా భావిస్తున్నా..
నా చేతుల మీదుగా స్వామి వారి చందనోత్సవ కార్యక్రమం నిర్వహించడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. భక్తులందరూ 40 రోజులపాటు స్వామి వారిని దర్శించుకోవాలి. ఇది ఈ జన్మకు హనుమాన్ భక్తులకు కలిగే ఒక గొప్ప అవకాశం. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. - మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే
