పెట్టుబడిదారీ విధానం చచ్చిపోయింది..ఆ శవాన్ని పక్కకు నెట్టాలి: జయతి ఘోష్

పెట్టుబడిదారీ విధానం చచ్చిపోయింది..ఆ శవాన్ని పక్కకు నెట్టాలి: జయతి ఘోష్
  • సంపన్నులకు పన్ను రాయితీలు.. సామాన్యులపై భారం
  • జాతీయవాదం అంటే మైనారిటీలపై దాడి కాదు
  • డాలర్ ఆధిపత్యంతో పేద దేశాల్లో అస్థిరత
  • భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంతర్జాతీయ నిపుణుల చర్చ

హైదరాబాద్, వెలుగు: సంపన్నులకు పన్ను రాయితీలు ఇస్తూ సామాన్యులపై పన్నుల భారం మోపడం వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాలతో ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోతుందని హెచ్చరించారు. నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం ప్రపంచంలో ఇప్పటికే చచ్చిపోయిందని, ఆ శవాన్ని పక్కకు నెట్టి ప్రజల అవసరాలు, పర్యావరణ పరిమితులకు అనుగుణమైన కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని ప్రొఫెసర్ జయతి ఘోష్ అన్నారు. జాతీయవాదం అంటే మైనారిటీ మతాలు, జాతులు, పొరుగు దేశాలపై దాడి చేయడం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్‌‌‌‌లో జరిగిన ‘భారత్ సమిట్–2026’లో ‘ఏ న్యూ ఎకనామిక్ డీల్ ఫర్ వరల్డ్’ అంశంపై అంతర్జాతీయ నిపుణులు చర్చించారు.

డాలర్ ఆధిపత్యంతో కరెన్సీలకు దెబ్బ

అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్ల నిర్ణయాలతో భారత రూపాయి సహా పలు దేశాల కరెన్సీల విలువ పడిపోతోందని జయతి ఘోష్ అన్నారు. డాలర్ ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కలిసి ఉమ్మడి ఆర్థిక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ (ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్), అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు సంక్షోభంలో ఉన్నాయని చెప్పారు. క్రిప్టో కరెన్సీ, ఏఐ రంగాల్లోని పెట్టుబడుల బుడగలను మినహాయిస్తే వాస్తవ రంగాల్లో దశాబ్దాలుగా పెట్టుబడులు తగ్గుతున్నాయని వివరించారు. 

1980 నుంచి ప్రభుత్వ ఆస్తులు, సంపద క్షీణిస్తుండగా ప్రైవేట్ సంపద అనేక రెట్లు పెరిగిందన్నారు. జీడీపీ వృద్ధి కంటే ప్రజల ఆనందం, ఆరోగ్యం, గుర్తింపులేని గృహ శ్రమకు విలువనిచ్చే వ్యవస్థ రావాలని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా కదిలే ఆర్థిక పెట్టుబడులను ఏ దేశమూ ఒంటరిగా ఎదుర్కోలేదని, ఉమ్మడి మార్కెట్ నియంత్రణలు అవసరమని పిలుపునిచ్చారు.

కలిసికట్టుగా ఒత్తిళ్లను ఎదుర్కోవాలి

ఈక్వెడార్ మాజీ విదేశాంగ మంత్రి గిల్లెర్మో లాంగ్ మాట్లాడుతూ.. భారత్ కూడా అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్లను ఒంటరిగా తట్టుకోలేదన్నారు. వర్ధమాన దేశాలు సమిష్టి సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. విదేశీ పెట్టుబడుల కోసం పొరుగు దేశాలతో పోటీపడి పన్నులు తగ్గించడం, వేతనాలు కుదించడం, నిబంధనలు సడలించడం వల్ల దేశాలు పాతాళానికి దిగజారే పోటీలో పడతాయని హెచ్చరించారు. బహుళజాతి కంపెనీలపై ఉమ్మడి నిబంధనలు విధించే పాలనా మండళ్లుగా దేశాలు ఏర్పడాలని అన్నారు. ఆర్థిక దోపిడీ, సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడటమే నిజమైన జాతీయవాదమని, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ‘బాండుంగ్ 2.0’ స్ఫూర్తితో ప్రాంతీయ కూటములుగా బలపడాలని పిలుపునిచ్చారు.

అసమానతలపై ప్రజలు ఏకం కావాలి

అసమానతలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను సమీకరించాలని దక్షిణాఫ్రికా మాజీ మంత్రి ఇబ్రహీం పటేల్ అన్నారు. అంతర్జాతీయ కంపెనీలు లాభాలను తరలించకుండా ఐరాస పన్నుల ఒప్పందం ద్వారా పన్ను న్యాయం తీసుకురావాలని సూచించారు. ప్రపంచ జనాభాలో 19 శాతం ఉన్న ఆఫ్రికా.. ప్రపంచ జీడీపీలో కేవలం 3 శాతం వాటానే కలిగి ఉందని చెప్పారు. ముడి సరుకుల ఎగుమతులకే పరిమితం కాకుండా పారిశ్రామికీకరణ సాధించాలని అన్నారు.

గాంధేయ నమూనా వైపు చూడాలి

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ప్రతినిధి ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్టుబడిదారీ, సోషలిస్ట్ వ్యవస్థలు రెండూ హద్దుల్లేని వినియోగ సంస్కృతినే ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. వాతావరణ సంక్షోభం నేపథ్యంలో ఉత్పత్తి, వినియోగాన్ని నియంత్రించే గాంధేయ ఆర్థిక నమూనాపై దృష్టి పెట్టాలని సూచించారు. దీనికి ప్యానెలిస్టులు మద్దతు తెలిపారు. 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్‌‌‌‌కు బంగారంతో ఉన్న సంబంధాన్ని తెంచినా, అది ప్రధాన రిజర్వ్ కరెన్సీగా కొనసాగుతూ అమెరికాకు అన్యాయమైన ప్రయోజనాన్ని కల్పిస్తోందని మోడరేటర్ పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పుడల్లా వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని, స్థానిక కరెన్సీలు ఒడిదుడుకులకు గురవుతున్నాయని వివరించారు.