- 20.09 బిలియన్ డాలర్లకు తగ్గిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: భారత దేశ మొత్తం ఎగుమతులు ఈ ఏడాది అక్టోబర్‌లో ఏకంగా 30 శాతం పెరిగి 89.99 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, సరుకుల ఎగుమతులు ఏడాది లెక్కన 45.06శాతం వృద్ధి చెందడం కలిసొచ్చింది. ఎగుమతులు పుంజుకోవడంతో దేశ వాణిజ్య లోటు గతేడాది అక్టోబర్‌లో ఉన్న 25.15 బిలియన్ డాలర్ల నుంచి 20.09 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక దిగుమతులు 94.42 బిలియన్ డాలర్ల నుంచి 110.07 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
అక్టోబర్‌లో సరుకుల ఎగుమతులు 49.47 బిలియన్ డాలర్లకు (రూ. 4.70 లక్షల కోట్లు) చేరాయి. సేవల ఎగుమతులు 39.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే ఏప్రిల్–-అక్టోబర్ మధ్య రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయి.ఏప్రిల్–-సెప్టెంబర్ కాలంలో మొత్తం ఎగుమతులు 14.47శాతం పెరిగి 478 బిలియన్ డాలర్లకు చేరాయి. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి ఆరు నెలల్లోనే అంచనాలో 47.8 శాతాన్ని సాధించాం.
టాప్ 50 ఎగుమతి గమ్యస్థానాల్లో 43 దేశాలకు ఎగుమతులు పెరిగాయి. స్పెయిన్‌కు ఏడాది లెక్కన ఏకంగా 352శాతం, మలేషియా, టోగో, సింగపూర్, ఈజిప్ట్ దేశాలకు 100శాతం పైగా వృద్ధి నమోదైంది. చైనాకు 48శాతం, జపాన్‌కు 45శాతం, అమెరికాకు 39శాతం చొప్పున ఎగుమతులు పెరిగాయి.ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల (ఎఫ్‌టీఏల) ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగపూర్‌కు ఎగుమతులు 103శాతం పెరిగి 11.07 బిలియన్ డాలర్లకు, ఆసియాన్ దేశాలకు 58శాతం పెరిగి 28.06 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
