- రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ సింధు శర్మ
- 2014–2026 మధ్య 829 మంది మావోయిస్టుల అరెస్ట్..
- 57 మంది మావోయిస్టుల మృతి.. 918 మంది లొంగుబాటు
- మారుమూల గ్రామాల్లో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడి
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఒకప్పుడు మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రమంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ సింధు శర్మ తెలిపారు. మావోయిస్టు హింసకు స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలిసే వారి సంఖ్య పెరుగుతుండటంతో పాటు మారుమూల గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నక్సల్ ముక్త్ భారత్ లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) సంయుక్తంగా శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లో మీడియా సదస్సు నిర్వహించాయి.
ఈ సందర్భంగా పీఐబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతోపాటు ఆమె పాల్గొని జిల్లాలో మావోయిస్టుల గత పరిస్థితులు, పోలీసుల చర్యలు, లొంగుబాట్లు, పునరావాసంపై వివరించారు. 2014 నుంచి 2026 వరకు జిల్లా పరిధిలో మొత్తం 829 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేయగా, 27 ఎదురు కాల్పుల ఘటనల్లో 57 మంది మృతి చెందారని, మరోవైపు 918 మంది మావోయిస్టులు హింసాత్మక మార్గాలను విడిచిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు.
గతంలో మావోయిస్టుల హింసాత్మక చర్యల కారణంగా 868 మంది సామాన్య పౌరులు, 331 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు రహదారులు, వంతెనలు ధ్వంసమై మారుమూల గ్రామాల ప్రజలు కనీస సదుపాయాలకు దూరమయ్యారని గుర్తుచేశారు. హింసాత్మక మార్గాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారికి ప్రభుత్వం పునరావాస పథకం ద్వారా అండగా నిలుస్తోందన్నారు. ఈ మీడియా సదస్సుకు హాజరైన మాజీ మావోయిస్టులు తమ అనుభవాలను పంచుకుంటూ, సాధారణ జీవితం ప్రారంభించేందుకు పునరావాస విధానం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. మావోయిస్టు హింసతో ఒకప్పుడు అభివృద్ధికి దూరమైన మారుమూల ప్రాంతాల్లో శాంతి, భద్రతలు నెలకొనడంతో పాటు మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పన దిశగా వేగంగా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
