- ఏటా రూ.30 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం..భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే 100 కోట్ల మంది కస్టమర్లను సంపాదించిన తొలి టెలికం సంస్థగా భారతీ ఎయిర్‌టెల్‌ను నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ప్రకటించారు. ఆర్థిక సేవలు, సావరిన్ క్లౌడ్, ఏఐ డేటా కేంద్రాల రంగాల్లోకి విస్తరిస్తామని వెల్లడించారు. భారతీ గ్రూప్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని, ఈ సంఖ్యను మరో 40 కోట్లు పెంచాలన్నది తమ టార్గెట్ అని వెల్లడించారు.
ఇందులో భారత్ నుంచి మరో 20 కోట్ల మంది, ఆఫ్రికా దేశాల నుంచి 10–15 కోట్ల మంది చేరే అవకాశం ఉందని అంచనా. కొత్త ఆదాయ మార్గాలను నిర్మించడంపైనా ఎయిర్టెల్ దృష్టి పెట్టింది. ఆర్థిక సేవలు, సావరిన్ క్లౌడ్, ఏఐ డేటా కేంద్రాలపై పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే ఏడాదికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలు, ఏజీఆర్ బకాయిలు మినహా ప్రజల నుంచి తీసుకున్న అప్పులు పూర్తిగా తీరుతాయని ఎయిర్టెల్ తెలిపింది. ప్రస్తుత టెలికాం వ్యాపార నిర్వహణకు నెట్‌వర్క్‌లు, టవర్లు, ఫైబర్ తదితర సదుపాయాలపై ఏటా సుమారు రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సునీల్ మిట్టల్ వివరించారు.
