- ఐదేళ్ల తర్వాత లిస్టింగ్ ధరకు చేరిన షేరు
న్యూఢిల్లీ: వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం పేరెంట్ కంపెనీ) అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్) కు వాలెట్ సేవలను నిర్వహించడానికి ఆర్బీఐ అనుమతిచ్చింది. నిబంధనల ప్రకారం, పీపీఎస్ఎల్ సంస్థ సెర్ట్ఇన్ గుర్తింపు పొందిన ఆడిటర్ లేదా సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిటర్ (సీఐఎస్ఏ) అర్హత కలిగిన నిపుణులతో సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ ఆడిట్ పూర్తయి, ఆర్బీఐ నుంచి తుది అనుమతి లభించిన తర్వాతే కంపెనీ వాలెట్ బిజినెస్‌ను ప్రారంభించాలి. ఈ నేపథ్యంలో వన్ 97 కమ్యూనికేషన్స్ షేరు శుక్రవారం 0.77 శాతం పెరిగి రూ.1,940 వద్ద ముగిసింది. కంపెనీ ఐదేళ్ల తర్వాత మళ్లీ తన ఐపీఓ ధరకు చేరింది. కాగా, 2014లో వాలెట్ సేవలను ప్రారంభించిన పేటీఎం, 2017లో దానిని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) కు బదిలీ చేసింది. అయితే నిబంధనల ఉల్లంఘన కారణంగా 2024 జనవరిలో పీపీబీఎల్ వాలెట్ సేవలపై ఆర్బీఐ ఆంక్షలు విధించగా, 2026 ఏప్రిల్‌లో బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది.
