ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు..తొలి దశలో 2 వేల మందికి చాన్స్

ఆటో కార్మికులకు  ఇందిరమ్మ ఇండ్లు..తొలి దశలో 2 వేల మందికి చాన్స్
  • ఒక్కో ప్రాంతంలో 500 చొప్పున 4 ప్రాంతాల్లో టవర్లు
  • 2 వేల ఫ్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
  • హౌసింగ్ శాఖను ఆదేశించిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని ఆటో కార్మికులకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటో డ్రైవర్ల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో గృహ నిర్మాణ పథకానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఈ ఇండ్ల నిర్మాణంపై హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ గౌతమ్ శుక్రవారం జీవో జారీ చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని బండ్లగూడ, గంధంగూడ, పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బషీరాబాద్, జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి/ లక్ష్మిగూడ ప్రాంతాల్లో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 

ఒక్కో ప్రాంతంలో 500 చొప్పున మొత్తం 2,000 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.220 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించారు. అర్హత ప్రమాణాలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల -టవర్స్ పథకం నిబంధనలే వర్తిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన స్థలాల లభ్యత, సాంకేతిక అంశాలు, భౌగోళిక అనుకూలతలను పరిశీలించి డీపీఆర్, ఆర్థిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హౌసింగ్ బోర్డు అధికారులను ఆదేశించారు. 

పేదలందరికీ సొంతింటి భరోసా

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ వర్గాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఆటోరిక్షా కార్మికుల కోసం ఆటో నగర్ కాలనీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భరోసా కల్పించే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని, గుడిసెలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యమని పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.