వరంగల్, వెలుగు: పండుగ సీజన్లో ప్రయాణికుల అదనపు రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో నవంబర్లో ఈ రెండు స్టేషన్ల మీదుగా సుమారు 150 ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ కల్పించారు.
దానాపూర్, రక్సౌల్, దర్భంగా, ప్రయాగ్రాజ్, సంత్రాగాచి, బరౌని, అగర్తలా, సిల్చార్తోపాటు ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. మరోవైపు భవిష్యత్ అవసరాల కోసం మార్గాల డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులను రైల్వే శాఖ వేగవంతం చేసింది.
మెరుగైన వసతులు పర్యవేక్షణ..
రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ఆర్పీఎఫ్ సిబ్బంది, టికెట్ తనిఖీ అధికారులను నియమించారు. మెగాఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు రైళ్ల సమాచారం అందిస్తున్నారు. రద్దీ నివారణకు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, యూటీఎస్ యాప్, క్యూఆర్ కోడ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
తాగునీటి వసతిని కూడా కల్పించారు. ఈ ఏర్పాట్లను ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. పండుగ సీజన్లో ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరైమన సౌకర్యాలు, సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
