- 30 మందికి తీవ్ర గాయాలు
- ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు
- మంటలు చెలరేగి, ఇతర వాహనాలకు వ్యాప్తి
ఫుజైరా: యూఏఈలోని ఫుజైరాలో షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో 14 మంది మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై యూఏఈ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రోడ్డుపై వేగంగా వస్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో అది బోల్తా పడింది.
ఆ సమయంలో అక్కడ ట్రాఫిక్ వల్ల నిలిచిపోయిన ఇతర వాహనాలపైకి ఈ బోల్తా పడిన వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రక్కుకు అకస్మాత్తుగా మంటలు అంటుకుని పక్కనే ఉన్న ఇతర వాహనాలకు వ్యాపించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో యూఏఈ పౌరులతోపాటు ఇతర దేశాల వారు కూడా ఉన్నారు. కొందరిని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫుజైరా పోలీసులు వెల్లడించారు.
మృతుల్లో ముగ్గురు ఇండియన్స్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 14 మందిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. కేరళలోని మలప్పురం జిల్లా వెంగర(ఏఆర్ నగర్) ప్రాంతానికి చెందిన కవలలు మహమ్మద్ అస్మిల్ సిద్దిఖ్(21), మిస్నా జుబిన్ సిద్దిఖ్(21)తోపాటు వారి మేనల్లుడు మహమ్మద్ ఫాయిజ్(3) కారులో వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఇదే కారులో ఉన్న మరో నలుగురు కుటుంబ సభ్యులు గాయపడి చికిత్స పొందుతున్నారు.
