- ఆలయ పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్, కలెక్టర్
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. వేములవాడ పట్టణంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులపై భీమేశ్వర స్వామి ఆలయ గెస్ట్ హౌస్ లో శనివారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఆర్కిటెక్ట్, ధార్మిక సలహాదారుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై ఆరా తీశారు. అనంతరం రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ కమిషనర్, కలెక్టర్, ఆర్ అండ్ బీ సీఈ, ఆర్కిటెక్ట్, ధార్మిక సలహాదారు, స్థపతులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆలయ విస్తరణ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, పనుల్లో ప్రతి దానికి గడువు విధించి వేగంగా పూర్తి చేయాలన్నారు. పనులకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లానాయక్, స్థపతులు జయేంద్రన్, గణేశ్, స్ట్రక్చర్ ఇంజినీర్ శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ జయంత్ తదితరులు ఉన్నారు.
