- తెలంగాణ గ్రేహౌండ్స్ దేశానికే ఆదర్శం-: డీజీపీ సీవీ ఆనంద్
- గ్రేహౌండ్స్‘ఎస్‌పీఎస్ ఓఓడీఏ షూట్ హౌస్’ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గ్రేహౌండ్స్ దేశంలోని పోలీసు బలగాలకే ఆదర్శంగా నిలుస్తోందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. నక్సలిజం, ఉగ్రవాదం, హైజాకింగ్ వంటి ముప్పులను ఎదుర్కోవడంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కర్రెగుట్టలు సహా అటవీ ప్రాంతాల్లో జంగిల్ ప్రాక్టీస్, వార్‌ఫేర్ ట్రైనింగ్ నిరంతరం కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ‘ఎనీ టైమ్.. ఎనీ సిచ్యుయేషన్.. యాక్షన్‌కు రెడీ’ అనే నినాదంతో పనిచేయాలని గ్రేహౌండ్స్‌కు పిలుపునిచ్చారు. శనివారం ఆయన రాజేంద్రనగర్‌లోని గ్రేహౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ‘ఎస్‌పీఎస్ ఓఓడీఏ షూట్ హౌస్’ను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల అధిపతి అనిల్‌కుమార్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. 1980వ దశకం నుంచి నక్సల్స్ కార్యకలాపాలు, ఉగ్రవాద ముప్పులను ఎదుర్కోవడంలో గ్రేహౌండ్స్ విశేష ప్రతిభ కనబరిచిందన్నారు. గ్రేహౌండ్స్ బలగాల సంఖ్య కనీసం 700 మందికి తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అమరుల స్మారకంగా షూట్ హౌస్
గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహిస్తూ అమరులైన సందీప్, పవన్, శ్రీధర్‌ల త్యాగాలకు గుర్తుగా షూట్ హౌస్‌కు ‘ఎస్‌పీఎస్ ఓఓడీఏ’గా నామకరణం చేసినట్లు డీజీపీ తెలిపారు. ఇందులో అబ్‌జర్వేషన్, ఓరియంట్, డిసైడ్ అండ్ ఆక్ట్ అనే నాలుగు సూత్రాలకు ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా పరిస్థితులను అంచనా వేసి, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కమాండోల్లో పెంపొందించడమే దీని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. హైజాకింగ్,
ఉగ్రవాద దాడులు, ఇతర అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కమాండోలు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.శిక్షణ, షూటింగ్‌లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు.
