పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటండి : మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి 

పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటండి : మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి 
  • భారత్ సమిట్ ముగింపు వేడుకల్లో మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ పిలుపు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటే రాయబారులుగా నిలవాలని విదేశీ ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ‘భారత్‌‌‌‌‌‌‌‌ సమిట్‌‌‌‌‌‌‌‌ 2026’ ముగింపు సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. ఆర్థిక వృద్ధికి విస్తృత అవకాశాలున్న తెలంగాణ.. ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రధాన కేంద్రంగా ఎదిగిందన్నారు.

తమ అంతర్జాతీయ పరిచయాల ద్వారా విదేశీ పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థలను తెలంగాణతో అనుసంధానించాలని కోరారు. భిన్న దృక్పథాలు ఒకే వేదికపైకి రావడంతో ప్రజాస్వామ్యం, న్యాయం, అంతర్జాతీయ సహకారంపై లోతైన చర్చ జరిగిందన్నారు. సదస్సును విజయవంతం చేసిన దేశ, విదేశీ ప్రతినిధులు, వక్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

రాహుల్ ఆలోచనలతో ‘అవర్ వరల్డ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్’: శ్రీధర్ బాబు 

అంతర్జాతీయ అంశాలపై పరిశోధన, ప్రపంచ సమస్యలకు పరిష్కారాల అన్వేషణకు శక్తిమంతమైన గ్లోబల్ థింక్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌గా ‘అవర్ వరల్డ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్’ను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు భారత్ సమిట్ వేదికగా ఈ సంస్థను ప్రారంభించామన్నారు.

ఏఐ, క్లౌడ్ క్యాపిటలిజం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమానత్వం, గ్లోబల్ సౌత్ సహకారం, వాతావరణ మార్పులు, బహుపాక్షిక సంస్థల సంస్కరణలు, లింగ న్యాయం, శాంతి, మీడియా భవిష్యత్తు, యువత పాత్ర వంటి అంశాలపై మేధావులు చర్చించారన్నారు. మరింత సమానత్వం, మానవీయ దృక్పథంతో కూడిన రేపటి ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారన్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’కు హాజరు కావాలని దేశ, విదేశీ ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు.