పేదల సంక్షేమ ఖర్చులో ..దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పేదల సంక్షేమ ఖర్చులో ..దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • డిసెంబర్ 9న ఖమ్మం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
  • త్వరలోనే వెలుగుమట్ల కాలనీ ప్రారంభం
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్/​దమ్మపేట వెలుగు : పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల అమలు ఖర్చులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.5 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడంతో ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధిదారుల సంఖ్య 45 లక్షలకు చేరిందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు రానుండగా, డిసెంబర్ 9న ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ఇందిరమ్మ మోడల్ కాలనీతో పాటు మున్నేరు కేబుల్ బ్రిడ్జి, మిర్చి మార్కెట్, మెడికల్ కళాశాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

సన్నబియ్యం పంపిణీ, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలతో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని తెలిపారు. అంతకుముందు రఘునాధపాలెం మండలంలోని మంచుకొండలో కూడా మంత్రి కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.  మరోవైపు, దమ్మపేట మండలం గండుగులపల్లిలో సీతారామ కాల్వ నిర్వాసిత రైతులు మంత్రి తుమ్మలను కలిసి తమ భూసేకరణ, పరిహార సమస్యలను విన్నవించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్వాసితులకు అండగా ఉండి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.