- కార్పొరేట్ ఆధిపత్యంతో జర్నలిజం మనుగడకు సవాళ్లు
- ‘ది ఫ్యూచర్ ఆఫ్ మీడియా’ ప్యానెల్ చర్చలో నిపుణుల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా మీడియా వ్యవస్థలు ప్రజల అవసరాల కన్నా మార్కెట్ శక్తుల ప్రభావంలోనే ఎక్కువగా నడుస్తున్నాయని మీడియా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ప్రయోజనాలు, వ్యవస్థాగత ఒత్తిళ్ల మధ్య జర్నలిజం తన ప్రాథమిక బాధ్యతను మరవకూడదని, లాభాల కన్నా ప్రజా ప్రయోజనాలు, సామాజిక విలువలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. శనివారం భారత్ సమిట్–2026లో భాగంగా ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ విభాగం చైర్మన్ పవన్ ఖేరా మోడరేటర్‌గా నిర్వహించిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ మీడియా’ ప్యానెల్ చర్చలో అంతర్జాతీయ మీడియా నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జర్నలిజం ఉత్పత్తికి, అభివృద్ధికి తోడ్పడే సంప్రదాయ సంస్థలు, వ్యవస్థలు బలహీనపడటం వల్ల సమాజంలో మీడియా పాత్ర మారిపోతోందని వక్తలు పేర్కొన్నారు.
ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ మీడియా సంస్థల మధ్య మరింత సహకారం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలపై కార్పొరేట్ ఆధిపత్యం పెరుగుతుండటం తీవ్ర సవాళ్లను తెచ్చిపెడుతోందన్నారు. ఇందుకు ఉదాహరణగా అమెరికాలో స్థానిక జర్నలిజం పతనాన్ని ప్రస్తావిస్తూ గత 2 దశాబ్దాల్లో అక్కడ 60 శాతం లోకల్ న్యూస్ అవుట్లెట్లు మూతపడ్డాయని గుర్తుచేశారు. కేవలం మార్కెట్ విలువను బట్టి కాకుండా సమాజం దృక్కోణాలు, అవసరాలు, విలువల ఆధారంగానే జర్నలిజం భవిష్యత్తు ఉండాలని ప్యానెల్ స్పష్టం చేసింది. మీడియా సంస్థలు ప్రస్తుత సవాళ్లను అధిగమించి సమాజంలో విశ్వసనీయత, ప్రాధాన్యతను కాపాడుకోవాలంటే ప్రజా ప్రయోజనాల పట్ల బలమైన నిబద్ధత కనబరచడం తప్పనిసరని తేల్చిచెప్పారు. ఈ చర్చలో జర్మనీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ లియోనార్డ్ నోవీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు సంగీత బారువా పిషారోటీ, ఫ్యూచర్ అండ్ ఇన్నోవేషన్ స్టడీస్ డైరెక్టర్ ఫ్రాన్సెస్కో లాపెంటా, కాప్30 ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రిటీ ప్రత్యేక రాయబారి ఫ్రెడెరికో అసిస్ పాల్గొన్నారు.
