“నువ్వు చనిపోతేనే మాకు ప్రశాంతంగా ఉంటుంది”.. భారత సంతతి అధికారిపై ఎన్విడియా మాజీ సీఈఓ షాకింగ్ కామెంట్స్!

 “నువ్వు చనిపోతేనే మాకు ప్రశాంతంగా ఉంటుంది”.. భారత సంతతి అధికారిపై ఎన్విడియా మాజీ సీఈఓ షాకింగ్ కామెంట్స్!

ప్రపంచంలోనే ప్రముఖ టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఎన్విడియా (Nvidia) గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చర్చనీయాంశంగా మారింది.  సంస్థ అధినేత జెన్సన్ హువాంగ్‌కు బయట ప్రపంచంలో చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా ఉండే వ్యక్తిగా పేరుంది. అయితే కంపెనీ లోపల మాత్రం ఆయన వ్యవహరించే తీరు పూర్తిగా వేరేలా ఉంటుందని కొన్ని నివేదికలు వెల్లడించాయి.

ముఖ్యంగా తన కింద పనిచేసే ఉద్యోగులు, ఉన్నతాధికారుల విషయంలో ఆయన చాలా కఠినంగా ఉంటారని, కొన్నిసార్లు కోపంతో హద్దులు దాటి మాట్లాడుతారని కంపెనీకి చెందిన కొందరు  వ్యక్తులు వెల్లడించినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది.

ఇటీవల జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వార్తల్లోకి వచ్చాయి. అయితే వాటికి సంబంధించిన విషయాలు ఇంకా ఆరోపణలుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గతంలో ఉద్యోగులతో వ్యవహరించిన తీరుకు సంబంధించిన పాత సంఘటనలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భారత సంతతికి చెందిన జే పూరిపై తీవ్ర ఆగ్రహం
ఈ సంఘటనల్లో ముఖ్యంగా భారత సంతతికి చెందిన ఎన్విడియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జే పూరితో జరిగిన వాగ్వాదం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నివేదికల ప్రకారం, గత ఏడాది ఫిబ్రవరిలో జెన్సన్ హువాంగ్ కంపెనీకి చెందిన 30 మందికి పైగా ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కంపెనీ వరల్డ్‌వైడ్ ఫీల్డ్ ఆపరేషన్స్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న జే పూరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ సమయంలో జే పూరిని ఉద్దేశించి హువాంగ్ చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ సంఘటన గురించి తెలిసిన ఒక వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. జెన్సన్ హువాంగ్ కోపంతో జే పూరితో మాట్లాడుతూ, “నీకు ఫ్లూ వచ్చి, నీ ఆరోగ్యం తీవ్రంగా  క్షీణించాలని కోరుకుంటున్నాను. నువ్వు చనిపోతేనే మాకు ఈ సమస్యలన్నీ తప్పుతాయి” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారట.

సాధారణంగా హువాంగ్ ఉద్యోగులపై గట్టిగా అరవడం, అసంతృప్తి వ్యక్తం చేయడం కంపెనీలో కొత్తేమీ కాదని చెబుతున్నారు. అయితే ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సమావేశంలో ఉన్న ఇతర అధికారులను సైతం షాక్‌కు గురిచేశాయి. ఒక్కసారిగా అక్కడి వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయిందని సమాచారం.

నవ్వుతున్నావని బయటకు పంపించేశారట!
జెన్సన్ హువాంగ్ కోపానికి సంబంధించి మరో సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఒకసారి ఓ సీనియర్ అధికారి ఆయనతో సమావేశానికి హాజరయ్యారు. అది హువాంగ్‌తో ఆ అధికారి పాల్గొన్న మొదటి సమావేశం. అయితే సమావేశం జరుగుతున్న సమయంలో ఆ అధికారి నవ్వుతున్నట్లు హువాంగ్ భావించారట. దీంతో ఒక్కసారిగా కోపానికి గురైన ఆయన..

“నన్ను చూసి నవ్వుతున్నావా? ఇక్కడ నాకు కనిపిస్తున్న ముఖాలన్నీ ఎలాంటి భావాలు లేనట్లుగా ఉన్నాయి. వెంటనే బయటకు వెళ్లిపో!” అంటూ ఆ అధికారిపై అరిచినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో ఆ అధికారి సమావేశం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని సమాచారం.

కోపంతో నీళ్ల బాటిల్ విసిరిన హువాంగ్!
ఎన్విడియా ప్రధాన కార్యాలయంలో జరిగిన మరో సంఘటన కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉన్న ఎన్విడియా ఆఫీసులో ఓ సమావేశం జరుగుతున్న సమయంలో, ఒక ఉన్నతాధికారిపై జెన్సన్ హువాంగ్ కోపంతో నీళ్ల బాటిల్ విసిరినట్లు కంపెనీకి చెందిన ఇంటర్నల్ వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటన కూడా ఆయన కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణగా ప్రస్తావించబడుతోంది.

బయట ప్రశాంతంగా కనిపించినా.. లోపల మరో వ్యక్తిత్వమా?
జెన్సన్ హువాంగ్ వ్యవహారశైలిపై తాజాగా చర్చ పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ఈ వారం న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన  ఒక కథనంలో, 'ది థింకింగ్ మెషీన్' పుస్తక రచయిత స్టీఫెన్ విట్ హువాంగ్ వ్యక్తిత్వం గురించి ప్రస్తావించారు. బయటకు చాలా మర్యాదగా, ప్రశాంతంగా కనిపించే హువాంగ్ ప్రవర్తనకు, కంపెనీ లోపల ఆయన వ్యవహరించే తీరుకు మధ్య చాలా తేడా ఉంటుందని ఆ కథనంలో వివరించినట్లు సమాచారం.

అంతేకాదు, ఆయన బయట ప్రదర్శించే మర్యాద వెనుక తన అహంకారాన్ని దాచిపెట్టే ప్రయత్నం ఉండవచ్చనే అభిప్రాయాన్ని కూడా రచయిత వ్యక్తం చేశారు. మొత్తానికి, ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన జెన్సన్ హువాంగ్‌కు సంబంధించి ఈ పాత సంఘటనలు మళ్లీ వెలుగులోకి రావడంతో ఆయన నాయకత్వ శైలి, ఉద్యోగులతో వ్యవహరించే తీరు గురించి కొత్త చర్చ మొదలైంది.