అమెరికా మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. 

అమెరికా మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. 

అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి రెండు విమానాలు ఢీకొన్నాయి. ట్యాక్సీవేపై కదులుతున్న కోపా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం రెక్క చివరి భాగం, యూపీఎస్‌కు చెందిన బోయింగ్ 767 కార్గో విమానం ముందు భాగాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో కోపా ఎయిర్‌లైన్స్ విమానంలో 166 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

పనామా సిటీ నుంచి వచ్చిన కోపా ఎయిర్‌లైన్స్ విమానం రాత్రి సుమారు 9.15 గంటల సమయంలో విమానాశ్రయంలో ట్యాక్సీవేపై కదులుతోంది. అదే సమయంలో బొగోటాకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న యూపీఎస్ కార్గో విమానంతో ఢీకొంది. ఈ ప్రమాదంలో కోపా విమానం రెక్క చివరి భాగం దెబ్బతిన్నట్లు సమాచారం.

ఇద్దరికి స్వల్ప గాయాలు

ప్రమాదం జరిగిన తర్వాత కోపా విమానాన్ని టెర్మినల్‌కు తీసుకెళ్లి ప్రయాణికులను సురక్షితంగా దించారు. ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో విమానాశ్రయ వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. మిగిలిన ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది క్షేమంగా ఉన్నారని కోపా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఘటనపై సంబంధిత అధికారులతో కలిసి దర్యాప్తునకు సహకరిస్తామని సంస్థ వెల్లడించింది.

మమ్మల్ని ఎవరో ఢీకొట్టారు

ప్రమాదానికి సంబంధించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంభాషణ ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో కోపా విమానం పైలట్.. తమ విమానాన్ని మరో విమానం ఢీకొట్టిందని కంట్రోలర్‌కు చెప్పడం వినిపించింది. దీనిపై యూపీఎస్ విమాన పైలట్ స్పందిస్తూ.. తాము కొంచెం ముందుకు వెళ్లామని, ఆ సమయంలో కోపా విమానం రెక్క తమ విమానాన్ని తాకిందని తెలిపాడు. అనంతరం తమ విమానం ఎడమ రెక్క చివరి భాగం కనిపించడం లేదని కోపా పైలట్  తెలిపాడు

ఒక్కసారిగా పక్కకు కదిలిన విమానం

విమానంలో ప్రయాణిస్తున్న సీజర్ ఫెర్రేరా అనే ప్రయాణికుడు ప్రమాద అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. విమానం సాధారణ వేగంతో ట్యాక్సీవేపై కదులుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని, ఆ వెంటనే ప్రయాణికుల అరుపులు మొదలయ్యాయని చెప్పారు. మరో విమానం తమ విమానాన్ని ఢీకొట్టడంతో లోపల ఉన్నవారికి విమానం ఒక్కసారిగా పక్కకు కదిలినట్లు అనిపించిందన్నారు. మొదట కొందరు ప్రయాణికులు భయాందోళనకు గురైనా, కోపా విమాన సిబ్బంది వెంటనే స్పందించి అందరినీ సీట్లలోనే ఉండాలని సూచించారని వివరించారు.

వరుస ఘటనలతో ప్రయాణికుల్లో ఆందోళన

ఈ ప్రమాదానికి ఒక రోజు ముందే అమెరికా వ్యాప్తంగా గ్రౌండ్ స్టాప్ కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో వందలాది విమానాల రాకపోకలు ప్రభావితమై, లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మియామి విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనడం మరోసారి విమానాశ్రయ భద్రతపై చర్చకు దారితీసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.