Sachin, Virat: క్యాలెండర్‌లో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ భారత క్రికెట్ అభిమానులకు మాత్రం నవంబర్ 15 (November 15) ఒక ఎమోషన్. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) జీవితాల్లో ఈ తేదీ ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలను మిగిల్చింది. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానం మొదలైందీ, ముగిసిందీ ఇదే రోజున కాగా.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టిందీ కూడా సరిగ్గా ఇదే తేదీన కావడం విశేషం.
సచిన్ అరంగేట్రం.. లాస్ట్ ఇన్నింగ్స్ కూడా నవంబర్ 15:
16 ఏళ్ల చిచ్చరపిడుగు ఎంట్రీ (1989): సరిగ్గా 37 ఏళ్ల క్రితం, 1989 నవంబర్ 15న 16 ఏళ్ల వయసులో సచిన్ పాకిస్థాన్‌పై టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసిన సచిన్, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. అక్కడి నుంచే అతడి జర్నీ స్టార్ట్ అయి, 24 ఏళ్ల పాటు కొనసాగి 34,357 పరుగులు, 100 అంతర్జాతీయ సెంచరీలతో (51 టెస్టులు, 49 వన్డేలు) ప్రపంచ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
చివరగా క్రీజులో అడుగుపెట్టిన రోజు (2013): విచిత్రమేమిటంటే.. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో చివరిసారిగా బ్యాటింగ్ చేసిందీ నవంబర్ 15నే.. 2013లో వెస్టిండీస్‌తో జరిగిన తన 200వ, చివరి టెస్టులో సచిన్ 74 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 495 రన్స్ చేయగా, విండీస్ (182, 187) ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో తొలి టెస్టు మాదిరిగానే తన చివరి టెస్టులోనూ సచిన్‌కు రెండో ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ దక్కలేదు.
సచిన్ ఉండగానే రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ:
* సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న 49 వన్డే సెంచరీల ప్రపంచ రికార్డును ఎవరూ అందుకోలేరని అందరూ అనుకున్నారు. కానీ, నవంబర్ 15న ఆ అసాధ్యాన్ని విరాట్ కోహ్లీ సుసాధ్యం చేశాడు.
* 50వ వన్డే శతకం: 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. సాక్షాత్తూ సచిన్ సమక్షంలోనే తన 50వ వన్డే సెంచరీని కంప్లీట్ చేసుకుని, ఈ రికార్డు సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
100 సెంచరీల దిశగా: ఇప్పటి వరకు వన్డేల్లో 55, టెస్టుల్లో 30, టీ20ల్లో 1 సెంచరీతో కోహ్లీ ఖాతాలో మొత్తం 86 అంతర్జాతీయ శతకాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లీ 100 సెంచరీల మైలురాయికి చేరుకోవడానికి ఇంకా 14 శతకాల దూరంలోనే ఉన్నాడు.
