ఢిల్లీలో సినిమా రేంజ్ ప్రతీకారం.. తమ్ముడిపై కాల్పులు.. నిమిషాల్లోనే కొట్టి చంపిన అన్న

ఢిల్లీలో సినిమా రేంజ్ ప్రతీకారం.. తమ్ముడిపై కాల్పులు.. నిమిషాల్లోనే కొట్టి చంపిన అన్న

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సినిమా రేంజ్‎లో జరిగిన రెండు ప్రతీకార హత్యలు తీవ్ర కలకలం రేపాయి. పాత కక్షల నేపథ్యంలో యువకుడిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఈ హత్యకు ప్రతీకారంగా మృతుడి సోదరుడు నిందితుడిని దారుణంగా కొట్టి హతమార్చాడు. ఢిల్లీ ప్రజలు ఉలిక్కిపడ్డ ఈ డబుల్ రివేంజ్ మర్డర్స్‎ గురించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. 

బవానా పోలీస్ స్టేషన్ పరిధిలోని పూత్ ఖుర్ద్ గ్రామంలో నవంబర్ 14వ తేదీ అర్ధరాత్రి సోను అలియాస్ ప్రదీప్, సచిన్‌ మధ్య పాత గొడవల నేపథ్యంలో మరోసారి వివాదం చెలరేగింది. మాట మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సోను తన దగ్గర ఉన్న తుపాకీతో సచిన్‏పై కాల్పులు జరిపాడు. ఛాతీలో బుల్లెట్ గాయమైన సచిన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సచిన్ మరణంతో అతని సోదరుడు నరేష్ తీవ్ర ప్రతీకారంతో రగిలిపోయాడు. ఎలాగైనా సోనును అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే నిందితుడు సోనును వెంటాడి దారుణంగా కొట్టి చంపేశాడు. తన సోదరుడి మరణానికి కేవలం 24 గంటల్లోనే నరేష్ రివేంజ్ తీర్చుకున్నాడు. ఈ జంట హత్యలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీ, స్థానికుల విచారణ ఆధారంగా పోలీసులు నిందితుడు నరేష్‌ను అరెస్ట్ చేశారు. మొదట కాల్పులకు గల అసలు కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.