డేటింగ్ యాప్లో పరిచయం.. పెళ్లి కోసం కెనడా నుంచి వచ్చిన మహిళ.. ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!

డేటింగ్ యాప్లో పరిచయం.. పెళ్లి కోసం కెనడా నుంచి వచ్చిన మహిళ..  ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!

ఆమెది కెనడా. అతనిది ఇండియా. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన ప్రియుడి కోసం పది వేల కిలోమీటర్లు దాటి ఇండియా వచ్చింది ఆ ప్రేయసి. కానీ ఆమెను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ప్రియుడు షాక్ గురయ్యాడు. పెళ్లి గిల్లి ఏదీ వద్దురా దేవుడా అంటూ ఆమెను రిజెక్ట్ చేయడంతో కేసుల వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుణ్ణి పెళ్లి చేసుకోవాలని కెనడా నుండి రాజస్థాన్‌కు వచ్చిన మహిళను, వయసు కారణంగా యువకుడు తిరస్కరించాడు. దీంతో ఆమె కెనడా దూతావాసాన్ని సంప్రదించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ ఘటన రాజస్థాన్‌లోని కోట్పుత్లి-బెహ్రోర్ జిల్లా నీమ్రానాలో 2026 నవంబర్ 13న వెలుగులోకి వచ్చింది. నీమ్రానా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం  ఈ మహిళకు, హర్యానాలోని పానిపట్‌కు చెందిన నితిన్‌కు దాదాపు ఒక ఏడాది క్రితం ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైంది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆ నిర్ణయం మేరకు ఆమె టూరిస్ట్ వీసాపై నవంబర్ 11న ఢిల్లీ చేరుకుంది. నితిన్ ఆమెను ఢిల్లీ విమానాశ్రయంలో కలుసుకున్నాడు. తన మేనమామ ఇంటికి నీమ్రానాను తీసుకెళ్లాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు వారిద్దరూ అక్కడే ఉన్నారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో మహిళ వయసు సుమారు 61 సంవత్సరాలు ఉంటుందని తెలియడందో  నితిన్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో వారి మధ్య వివాదం తలెత్తింది.

నితిన్ మాటలు నమ్మి వేల కిలోమీటర్లు దాటి వచ్చిన తనను రిజెక్ట్ చేయడంపై ఆగ్రహించిన ప్రియురాలు.. నవంబర్ 13న ఆమె కెనడా దౌత్యకార్యాలయంలో ఫిర్యాదు చేసింది.  కెనడా ఎంబసీ ఆదేశాల మేరకు నీమ్రానా పోలీసులు  ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

ప్రస్తుతం నితిన్‌ను విచారణ కోసం అదుపులో ఉంచారు. కెనడా మహిళను కోట్పుత్లిలోని కోర్ సెంటర్‌లో ఉంచారని పోలీసులు తెలిపారు. నితిన్ పానిపట్‌కు చెందిన వ్యక్తి అని, ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు చెప్పారు. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.