కిలో స్వీట్ ధర రూ.1.11 లక్షలు.. బంగారం, వెండితో తయారు చేసి నగల పెట్టెలో ప్యాకింగ్.. ఎక్కడో తెలుసా?

 కిలో స్వీట్ ధర రూ.1.11 లక్షలు.. బంగారం, వెండితో తయారు చేసి నగల పెట్టెలో ప్యాకింగ్.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా పండుగలు వచ్చాయంటే చాలు.. ఇళ్లల్లో రకరకాల పిండి వంటలు, స్వీట్లు  చేస్తుంటారు. బంధువులు, మిత్రులకు స్వీట్స్  పంచుతూ పండుగ ఆనందాన్ని పంచుకుంటారు. అయితే ఇప్పుడు పండుగలకు కూడా లగ్జరీ టచ్ పెరుగుతోంది. ముఖ్యంగా ధనికులు, ప్రముఖులను ఆకర్షించేందుకు వ్యాపారులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్వీట్ షాప్ ఏకంగా బంగారం, వెండితో స్వీట్స్  తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ కిలో స్వీట్ ధర అక్షరాలా రూ.1.11 లక్షలు. ఒక్క స్వీట్ ముక్క కొనాలన్నా వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిందే!

కిలో స్వీట్ ధర రూ.1.11 లక్షలు.. అసలు ఇందులో ఏముంటుంది?
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని వైశాలి నగర్ ప్రాంతంలో 'త్యోహార్' పేరుతో ఓ స్వీట్ షాప్ ఉంది. ఈ షాప్ ప్రత్యేకంగా తయారు చేస్తున్న కాస్ట్లీ స్వీట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా స్వీట్లపై వెండి పూత వేయడం మనకు తెలిసిందే. కానీ ఈ షాప్  మాత్రం ఒక అడుగు ముందుకేసి 24 క్యారెట్ల తినదగిన బంగారం, వెండితో ప్రత్యేకమైన స్వీట్స్ తయారు చేస్తోంది. ఈ స్వీట్స్ ధరలు కిలోకు రూ.45 వేల నుంచి మొదలై రూ.1.11 లక్షల వరకు ఉన్నాయి. అంటే ఒక కిలో స్వీట్ కొనాలంటే కొందరి నెల జీతం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట!

ఒక్క స్వీట్ ముక్క ధరే రూ.1,111.. మరో స్వీట్ ధర రూ.1,150!
ఈ షాప్ లో లభించే ప్రత్యేకమైన స్వీట్లలో 'స్వర్ణ మిఠాయి', 'చాందీ భస్మ్ పాక్' ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
గోల్డ్ స్వీట్ : 24 క్యారెట్ల తినదగిన బంగారు రేకులతో తయారు చేసే ఈ గోల్డ్ స్వీట్ ఒక్క ముక్క ధర రూ.1,111.
చాందీ భస్మ్ భారత్: వెండితో తయారు చేసే ఈ ప్రత్యేక స్వీట్ ఒక్క ముక్క ధర రూ.1,150.
ఇవి కాకుండా స్వర్ణ భస్మ్ పాక్, చాందీ భస్మ్ పాక్ వంటి మరికొన్ని ప్రత్యేక రకాల స్వీట్స్ కూడా  ఉన్నాయి.

వీటి తయారీలో ఉపయోగించే పదార్థాలతో పాటు, వాటిని అందంగా అలంకరించే విధానం, ప్రత్యేకమైన ప్యాకింగ్ కూడా వీటి ధర ఎక్కువగా ఉండటానికి కారణమని షాపు నిర్వాహకులు చెబుతున్నారు.

స్వీట్ కొనాలంటే నగల షాపుకి వచ్చినట్లే!
ఈ స్వీట్స్  ప్రత్యేకత కేవలం వాటి ధరలోనే లేదు. వాటిని కస్టమర్లకు అందించే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. సాధారణంగా స్వీట్లను అట్టపెట్టెల్లో లేదా ప్రత్యేకమైన ప్యాకింగ్ బాక్సుల్లో ఇస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం అత్యంత ఖరీదైన బంగారు స్వీట్స్ ని ఏకంగా నగల పెట్టెలో పెట్టి ఇస్తున్నారు.

దీంతో స్వీట్ కొనడానికి వచ్చినవారికి నగలు కొనుగోలు చేస్తున్న అనుభూతి కలుగుతుంది. గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా ఈ స్వీట్స్  ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ ఖరీదైన ఆలోచన వెనుక ఉన్నది ఓ మహిళ!
ఇంత ఖరీదైన స్వీట్స్  తయారీ ఆలోచన వెనుక అంజలి జైన్ అనే మహిళ ఉన్నారు. ఆమె గతంలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి పారిశ్రామికవేత్తగా మారారు. ఆయుర్వేదం, భారతీయ సంప్రదాయ వంటకాలపై తనకున్న ఆసక్తి నుంచి ఈ ప్రత్యేకమైన స్వీట్స్  తయారీ ఆలోచన వచ్చిందని అంజలి తెలిపారు.

సంప్రదాయ భారతీయ ఆహార విధానాన్ని ఆధునిక విలాసవంతమైన రూపంలో అందించాలనే ఉద్దేశంతో ఈ స్వీట్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. పండుగల సమయంలో ప్రజలకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించాలన్నదే మా ప్రయత్నమని వివరించారు.

బంగారంతో పాటు ఖరీదైన డ్రై ఫ్రూట్స్ కూడా!
రూ.1.11 లక్షల విలువైన ఈ స్వీట్స్  లో కేవలం బంగారం మాత్రమే ఉండదు. అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటైన చిల్‌గోజా (పైన్ నట్స్), కుంకుమపువ్వు వంటి విలువైన పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, ఇందులో 24 క్యారెట్ల తినదగిన బంగారాన్ని కూడా కలుపుతున్నారు. దీనిని స్వర్ణ భస్మం అని పిలుస్తారు.

ఈ స్వీట్స్  పై ప్రత్యేకంగా బంగారు అలంకరణ కూడా చేస్తారు. అంజలి జైన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇందుకోసం జైన దేవాలయం నుంచి పొందిన బంగారు పనితనాన్ని ఉపయోగిస్తున్నారు. కుంకుమపువ్వు పూత, పైన్ నట్స్ అలంకరణతో ఈ స్వీట్స్  కి మరింత ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొస్తారు.

భారతీయ సంప్రదాయానికి లగ్జరీ టచ్!
ఆయుర్వేదం, భారతీయ సంప్రదాయ వంటకాలలో బంగారం, వెండి వినియోగానికి చారిత్రక నేపథ్యం ఉందని అంజలి చెబుతున్నారు. అలాంటి సంప్రదాయాలను ఆధునిక పద్ధతుల్లో ప్రజలకు పరిచయం చేయాలన్నదే మా ఉద్దేశమని వివరించారు. ఈ నేపథ్యంలో సాధారణ స్వీట్స్  కి భిన్నంగా బంగారం, వెండి, ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేకమైన స్వీట్లను రూపొందించారు.

మొత్తానికి పండుగలు వచ్చాయంటే స్వీట్లు కొనడం సహజమే. కానీ జైపూర్‌లోని ఈ షాపులో మాత్రం స్వీట్లు కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఒక్క ముక్క స్వీట్ ధరే వెయ్యి రూపాయలకు పైగా ఉంది. కిలో కొనాలంటే ఏకంగా రూ.1.11 లక్షలు ఖర్చు చేయాలి.