రాగి సంకటి నుంచి నాటుకోడి పులుసు దాకా.. హైదరాబాద్‌లో పల్లె రుచుల సందడి

రాగి సంకటి నుంచి నాటుకోడి పులుసు దాకా.. హైదరాబాద్‌లో పల్లె రుచుల సందడి
  • మిల్లెట్ కేఫ్‌‌‌‌ల నుంచి ఆర్గానిక్ రెస్టారెంట్ల దాకా
  • జొన్న రొట్టె, రాగి సంకటి, నాటుకోడి పులుసుకు ఫుల్ డిమాండ్
  • మట్టి కుండ, కట్టెల పొయ్యి వంటకాల హవా
  • తాటిపాకలు, మట్టి గోడలతో పల్లెటూరి థీమ్

 

జొన్న రొట్టె.. దాంట్లోకి నాటుకోడి కూర.. పక్కన పచ్చిమిర్చి పచ్చడి, ఉల్లిగడ్డ ముక్కలు.. ఈ కాంబినేషన్ పేరు చెబితేనే నోరూరుతుంది కదా! ఒకప్పుడు పల్లె వంటింట్లో ఘుమఘుమలాడిన ఈ రుచులు ఇప్పుడు హైదరాబాద్ రెస్టారెంట్లలో స్పెషల్ మెనూగా మారాయి. పిజ్జాలు, బర్గర్లకు అలవాటుపడిన సిటీ జనం మళ్లీ తెలంగాణ పల్లె రుచుల వైపు అడుగులేస్తున్నారు. జొన్న రొట్టెలు, రాగి సంకటి, సజ్జ గటక నుంచి మట్టి కుండలో వండిన నాటుకోడి పులుసు దాకా.. పాతకాలపు వంటకాలు కొత్త రూపంలో ఫుడ్ లవర్స్‌‌‌‌ను ఆకట్టుకుంటున్నాయి. బిజీ సిటీ లైఫ్‌‌‌‌లో ఇవి కేవలం తిండి కాదు, చిన్ననాటి జ్ఞాపకాలను, ఊరి అనుభూతులను గుర్తుచేస్తున్నాయి.

మట్టి కుండ.. కట్టెల పొయ్యి

టేస్టింగ్ పౌడర్లు, రసాయనాలు లేకుండా మట్టి కుండల్లో, కట్టెల పొయ్యిపై వండిన నాటుకోడి పులుసు, తలకాయ కూర, బోటి ఫ్రై, పాయా, బగారా అన్నం, పప్పుచారులోని సహజ రుచిని సిటీ జనం బాగా ఇష్టపడుతున్నారు. అల్యూమినియం, స్టీల్ పాత్రలను పక్కనబెట్టి మట్టి కుండల్లో వండే బిర్యానీలకూ డిమాండ్ పెరిగింది. చాలా రెస్టారెంట్లు తిండి మాత్రమే కాకుండా మంచెలు, తాటిపాకలు, మట్టి గోడలతో పల్లెటూరి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కర్మన్‌‌‌‌ఘాట్ నుంచి సికింద్రాబాద్ దాకా సిటీలోని చాలా ప్రాంతాల్లో తెలంగాణ వంటకాల థీమ్ రెస్టారెంట్లు, దాబాలు వెలిశాయి. ఫాస్ట్ లైఫ్‌‌‌‌కు అలవాటైన సిటీ జనానికి ఇవి మన సంస్కృతిని గుర్తుచేస్తూ మంచి అనుభూతిని ఇస్తున్నాయి. విదేశీ వంటకాలు ఎన్ని వచ్చినా మన జొన్న రొట్టెకు, రాగి సంకటికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఒకప్పుడు పల్లె పొయ్యికే పరిమితమైన రుచులు ఇప్పుడు పట్నం డైనింగ్ టేబుల్‌‌‌‌పై సందడి చేస్తున్నాయి. కాలం మారినా, వంటకాల రూపం మారినా తెలంగాణ పల్లె రుచి మాత్రం మారదు!

ఐటీ కారిడార్‌‌‌‌లో మిల్లెట్ దోశ

ఒకప్పుడు పల్లెల్లో, ఇంట్లోని పెద్దవాళ్లు మాత్రమే ఇష్టంగా తినే ఆహారం ఇప్పుడు హైటెక్ సిటీ రెస్టారెంట్లలో ట్రెండ్‌‌‌‌గా మారింది. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలతో చేసిన దోశలు, ఇడ్లీలు, ఉప్మాలు ఐటీ కారిడార్‌‌‌‌లో హాట్‌‌‌‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. జంక్ ఫుడ్‌‌‌‌తో వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన పెరగడంతో, పోషకాలు ఎక్కువగా ఉండే చిరుధాన్యాల వంటకాల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవాళ్లు, షుగర్, బీపీ ఉన్నవాళ్లు వీటిని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.