జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనుస్‌కు పశ్చిమాన ఉన్న అల్-మవాసిలో ఆదివారం (నవంబర్ 14) తెల్లవారుజూమున ఇజ్రాయెల్ వైమానికి దాడి చేసింది. హమాస్‌కు చెందిన అల్-ఖస్సాం బ్రిగేడ్స్ కమాండర్ సమీర్ అబు యూనీస్ ఈ దాడిలో హతమయ్యాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.
హమాస్ సైనిక విభాగానికి అల్-ఖస్సాం బ్రిగేడ్స్ కమాండర్ యూనుస్ లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. దక్షిణ గాజాలో జరిగిన వైమానిక దాడిలో హమాస్ కమాండర్ మరణించినట్లు పాలస్తీనా వర్గాలు ధృవీకరించాయి. గాజా పౌర రక్షణ ప్రతినిధి మహమూద్ బస్సల్ మాట్లాడుతూ.. 53 ఏళ్ల హమాస్ కమాండర్ యూనీస్ మృతదేహం లభ్యమైందని తెలిపారు. దక్షిణ గాజాలో జరిగిన దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారని ఆయన వెల్లడించారు.
నవంబర్ 13న కూడా దాడి
2026, నవంబర్ 13న కూడా దక్షిణ గాజాలోని ఖాన్ యూనుస్‌లో ఉన్న నాసర్ మెడికల్ కాంప్లెక్స్‌లోని సర్జికల్ విభాగంపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు మరణించారు. మరో 27 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ అల్ జజీరా నివేదించింది. ఈ దాడిలో డాక్టర్ రిజ్క్ అబు షువైరాతో సహా ఆరుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
వైద్య సదుపాయాలు, ఆరోగ్య కార్యకర్తలు, రోగులను రక్షించే అంతర్జాతీయ చట్టాలను ఈ దాడి స్పష్టంగా ఉల్లంఘించడమే అని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఆసుపత్రులను రక్షించడానికి, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి, ఐక్యరాజ్యసమితి సంస్థలకు విజ్ఞప్తి చేసింది.
2023లో మొదలైన యుద్ధం
2023, అక్టోబర్ 7 పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడితో యుద్ధం చెలరేగిన సంగతి తెలిసిందే. 2025 అక్టోబర్‌లో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్, హమాస్‌లు పదేపదే ఉల్లంఘిస్తున్నాయి. అమెరికా మద్దతుతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పోరాట తీవ్రతను చాలా వరకు తగ్గించినప్పటికీ, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ క్రమం తప్పకుండా దాడులు కొనసాగిస్తూనే ఉంది.
