వైద్య విజ్ఞాన శాస్త్రంలో మరో సంచలనం. మన కంటికి సరిగ్గా కనిపించనంత సూక్ష్మంగా ఉండే ఒక బ్రెయిన్ ఇంప్లాంట్ (చిప్) సజీవ జంతువుల మెదడులో ఏడాదిపాటు ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేసి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ అద్భుత పరికరం న్యూరాలజీ విభాగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
ఏమిటీ ‘మోట్’ ?
పరిశోధకులు ఈ చిప్‌కు MOTE (Microscale Optoelectronic Tetherless Electrode) అని పేరు పెట్టారు. దీని పరిమాణం సాధారణ ఉప్పు గింజ కంటే చాలా చిన్నది.
పొడవు: కేవలం 300 మైక్రాన్లు
వెడల్పు: 70 మైక్రాన్లు మాత్రమే
“మనకు తెలిసినంత వరకు– మెదడులోని విద్యుత్ చర్యలను కొలిచి, వైర్‌లెస్ పద్ధతిలో బయటకు పంపగల ప్రపంచంలోనే అత్యంత చిన్న న్యూరల్ ఇంప్లాంట్ ఇదే" అని ఈ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహించిన ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ అల్యోషా మోల్నార్ పేర్కొన్నారు.
ఎలా పనిచేస్తుంది?
సాధారణ చిప్‌ల మాదిరిగా దీనికి బ్యాటరీలు గానీ, వైర్లు గానీ ఉండవు. ఇది పూర్తిగా కాంతి తరంగాల ఆధారంగా పనిచేస్తుంది. మెదడు కణజాలానికి ఎటువంటి హాని కలిగించని రెడ్, ఇన్‌ఫ్రారెడ్ లేజర్ కిరణాల ద్వారా దీనికి శక్తి అందుతుంది. మెదడులోని న్యూరాన్ల విద్యుత్ సిగ్నల్స్‌ను ఇది గ్రహించి, వాటిని ఇన్‌ఫ్రారెడ్ లైట్ పల్స్‌ల రూపంలోకి మార్చి బయటకు పంపుతుంది.
శాటిలైట్ టెక్నాలజీ వినియోగం
అంతరిక్షంలోని శాటిలైట్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్‌లో వాడే ‘పల్స్ పొజిషన్ మాడ్యులేషన్’ కోడ్‌ను ఇందులో ఉపయోగించారు. దీనివల్ల అత్యంత తక్కువ విద్యుత్‌తోనే డేటాను కచ్చితత్వంతో బయటకు పంపడం సాధ్యమైంది.
భవిష్యత్తులో ప్రయోజనాలేంటి?
ఎంఆర్ఐ స్కాన్లకు అనుకూలం: ప్రస్తుతం వాడుతున్న లోహపు ఇంప్లాంట్లు ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయడం కష్టం. కానీ ‘మోట్’ తయారీలో వాడిన ప్రత్యేక మెటీరియల్ వల్ల, రోగికి ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్న సమయంలోనూ మెదడు సంకేతాలను సులభంగా రికార్డ్ చేయవచ్చు.
విస్తృత వినియోగం: భవిష్యత్తులో దీనిని కేవలం మెదడుకే పరిమితం చేయకుండా వెన్నుపాము, కృత్రిమ పుర్రె ప్లేట్లు, ఇతర శరీర కణజాలాలలో కూడా అమర్చి నాడీ సంబంధిత వ్యాధులకు మెరుగైన చికిత్స అందించవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎలుకలపై ఏడాదిపాటు ప్రయోగం
తొలుత సెల్ కల్చర్స్‌లో ఈ చిప్ సామర్థ్యాన్ని పరీక్షించిన శాస్త్రవేత్తలు, ఆ తర్వాత ఎలుకల మెదడులో (ముఖ్యంగా మీసాల కదలికల సమాచారాన్ని ప్రాసెస్ చేసే ‘బ్యారెల్ కార్టెక్స్’ భాగంలో) దీనిని అమర్చారు. ఏడాది కాలం పాటు ఆ ఎలుకలు పూర్తి ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటూనే వాటి మెదడులోని న్యూరాన్ల కదలికలను ఈ చిప్ నిరంతరాయంగా రికార్డ్ చేసింది.
మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
[email protected] కి మెయిల్ చేయండి.
