గద్వాల జిల్లా కోర్టు భవన నిర్మాణం పూర్తి చేయండి : హైకోర్టు

గద్వాల జిల్లా కోర్టు భవన నిర్మాణం పూర్తి చేయండి : హైకోర్టు
  •     ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా కోర్టు సమీకృత భవన సముదాయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుతం పనిచేస్తున్న కోర్టుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. జిల్లా కోర్టు భవన సముదాయం కోసం పూడూరులో 10 ఎకరాల స్థలం కేటాయించినా ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని పేర్కొంటూ న్యాయవాది షఫీవుల్లా పిల్ దాఖలు చేశారు. 

దీనిపై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుల ధర్మాసనం విచారణ చేపట్టింది. భవన నిర్మాణానికి నిధుల కేటాయింపు, వివిధ శాఖల అనుమతులు అవసరమైనందున నిర్దిష్ట గడువు విధించడం సాధ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే భూమి కేటాయింపుతోపాటు నిధుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినందున నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.