- మరణశిక్షపై అప్పీల్‌కు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వాలి
- బంగ్లాకు తిరిగొచ్చాక భద్రత బాధ్యతా ఆ దేశ సైన్యానిదే
- బీబీసీ బంగ్లా కథనం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి అప్పగించే విషయంలో చట్టపరమైన మార్గాల్లోనే వ్యవహరిస్తామని భారత్ స్పష్టం చేసింది. అయితే, ఆమెను తిరిగి పంపించేందుకు ఢిల్లీ రెండు షరతులు విధించిందంటూ బీబీసీ బంగ్లా ప్రచురించిన కథనంపై స్పందించేందుకు నిరాకరించింది. హసీనాను బంగ్లాదేశ్ సైనిక విమానంలోనే తిరిగి తీసుకెళ్లాలని, ఆమెకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు జులై ఉద్యమ సమయంలో జరిగిన హత్యలపై కొత్తగా విచారణ జరపాలని భారత్ షరతులు పెట్టినట్లు గురువారం వెలువడిన బీబీసీ బంగ్లా కథనం పేర్కొంది.
అలాగే, స్వదేశానికి చేరుకున్న తర్వాత ఆమె భద్రత బాధ్యతను బంగ్లాదేశ్ సైన్యమే తీసుకోవాలని భారత్ భావిస్తున్నది. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ సైనిక విమానంలోనే హసీనా భారత్‌కు వచ్చారని, తిరిగి ఆమెను తీసుకెళ్లేందుకు కూడా ఆ దేశ సైన్యమే విమానం పంపించాలని భారత్ సూచించినట్లు కథనంలో పేర్కొన్నారు.
మూడో దేశానికి పంపే ప్రయత్నాలు విఫలం..
హసీనా భారత్‌లో కొనసాగుతుండటం ఇరు దేశాల సంబంధాలతో పాటు అంతర్జాతీయంగా కూడా ఇబ్బందికరంగా మారిందని బీబీసీ బంగ్లా పేర్కొంది. ఆమెను మూడో దేశానికి పంపేందుకు ఢిల్లీ చేసిన ప్రయత్నాలు వివిధ కారణాలతో విఫలమయ్యాయి. దీంతో బంగ్లాదేశ్‌కు పంపించి అక్కడి న్యాయ ప్రక్రియను ఎదుర్కొనేలా చేయడమే మార్గమని భారత్ భావిస్తున్నట్లు తెలిపింది.
హసీనాకు న్యాయమైన పునర్విచారణ జరగాలని, ఈ ప్రక్రియను అంతర్జాతీయ సమాజం, ప్రపంచ మీడియా పర్యవేక్షించాలని భారత్ కోరుకుంటున్నట్లు వెల్లడించింది. హసీనా తిరుగు ప్రయాణంపై భారత్, బంగ్లాదేశ్ సైన్యాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బీబీసీ కథనం తెలిపింది. మరోవైపు, బంగ్లాదేశ్‌లో హసీనా రాకతో రాజకీయ అస్థిరత పెరిగే అవకాశం ఉందని భారత అధికారులు భావిస్తున్నట్లు తెలిపింది.
తిరిగి వెళ్లడంపై అనుమానాలు..
భారత్ కోరుతున్న షరతులు నెరవేరడం సులభం కాదని, డిసెంబర్‌లో ఆమె తిరిగి రావడంపై అనుమానాలు ఉన్నాయని భారత్ అభిప్రాయపడుతున్నట్లు బీబీసీ పేర్కొంది. హసీనా స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధపడినా, బంగ్లా ప్రభుత్వం అడ్డుకుందని చెప్పుకునే అవకాశం భారత్‌కు ఉంటుందని ఓ అధికారి వ్యాఖ్యానించినట్లు వెల్లడించింది. మరోవైపు, ఆమె భారత్‌లో కొనసాగడంపై అంతర్జాతీయ విమర్శలు వస్తున్న నేపథ్యంలో, అప్పగింత అంశాన్ని చట్టపరమైన మార్గాల్లోనే పరిష్కరిస్తామని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
