కార్తీక మాసం విశిష్టత.. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

 కార్తీక మాసం విశిష్టత.. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

ప్రతీ జీవికి ప్రకృతి ఒక వరం. ప్రపంచానికి ముఖ్యం ప్రకృతి. ఆ ప్రకృతిలో మార్పులే ఋతువులు. ఆ ఋతువులో చల్లని వాతావరణం కలిగినది శరదృతువు.శరదృతువులోని ప్రత్యేక మాసం ‘‘కార్తీక మాసం’’. పరమ పవిత్రుడు అగ్నిదేవుడు. అతను కృత్తికా నక్షత్రానికి అధిదేవత. ఆ నక్షత్రం పూర్ణిమనాటి చంద్రునితో కూడి ఉన్న మాసం ఈ కార్తీక మాసం. అందువల్ల ఈ మాసం అగ్నివలే పవిత్రమైనది. ఈ నెల శివుడు, విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రధమైనది.

న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్, 
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.

కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. అని స్కాంద పురాణం చెబుతోంది.  ఈ మాసంలో చేసే స్నానం అత్యంత ఆరోగ్యప్రదం. ఇచ్చే దానం పుణ్య ఫల ప్రదం. చేసే వ్రతం సంపత్కరం. ఉపవాసం ఉదరకోశానికి రక్షణం.జఠర శక్తికి ఉద్దీపన. వెలిగించే దీపం శుభకరమవుతుంది. పురాణ పఠనం భక్తి, ముక్తి ప్రధానమవుతుంది. అభిషేకం శారీరక, మానసిక ప్రశాంతి కలిగిస్తుంది. అందుకే ఇవన్నీ ఈ కార్తీక మాసంలో యథాశక్తి చేయాలని శాస్త్రం చెబుతుంది. ఇవి శివుణ్ణి ఉద్దేశించి చేసినా, విష్ణువుని ఉద్దేశించి చేసినా పూర్ణఫలప్రదమే. శివకేశవులిద్దరికి అత్యంత ప్రీతికరమైనందువల్లనే ఈ మాసానికి ఇంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత. ఈ మాసంలో ఉసిరి చెట్టుపై అనేక దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి. అందువల్లనే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కొమ్మలను తెంపకూడదని శాస్త్రం చెబుతుంది.

పండుగల మాసం

అడుగడుగునా ఒక పర్వదినం. అణువణువునా ఆధ్యాత్మిక తత్వం, అందులో అంతర్లీనంగా ఒక ఆరోగ్య సూత్రం. రోజు రోజుకీ ఒక ప్రత్యేకత ఉన్న మాసమిది. ప్రశాంత వాతావరణం శరదృతువు ప్రత్యేకత. ఆ ఋతువులో ఇది రెండోమాసం. వన విహారాలకు, వన భోజనాల ప్రత్యేక మాసం ఇదే.వనబోజనాలతో జనప్రదం.వనభోజనాలే శుభప్రదం.అంటే వనభోజనాల ద్వారా బంధువులు, మిత్రులు అందరూ కలిసి ఒకే చోట భోజనం చేయడం వల్ల ఎలాంటి మనస్పర్థలు లేకుండా కలిసిమెలిసి ఉండడం, ఇంకా ఒక్క కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా సమాజం, ప్రజలందరు వసుదైక కుటుంబంలా కలిసి ఉండాలని దాని పరమార్ధం. అంటే వనబోజనాలకు ఉసిరి చెట్టు,తులసి చెట్టు ఉంటే మంచిదని శాస్త్రం చెబుతుంది.

ఈ మాసంలో హరికి శయ్యగా, హారునికి ఆభరణంగా, హాలికులకు వ్యవసాయ క్షేత్ర రక్షకులుగా, భూభారం వహించే ఆది శేషువుగా, ఇంకా అనేక రకాలుగా నాగుల సేవలు సర్వవిదితమే .అందుకే వాటిని గౌరవించి పూజించే నాగుల చవితి(శుక్ల చతుర్థి)కూడా ఈ మాసంలోనే. జ్ఞాన పంచమి పేరుతో పుస్తక రూపంలో సరస్వతిని పూజించే రోజు శుక్లపంచమి.పుస్తక భాండాగారాన్ని శుభ్రపరచి సరస్వతిని పూజించే దినమిది. కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. శుక్లపక్ష ఏకాదశి , ఉత్తాన ఏకాదశి, ఆషాడ శుక్ల ఏకాదశి నాడు శేషపాన్పు మీద పవళించిన విష్ణువు ఈ రోజు మేలుకొంటాడంటారు. ఈ రోజు శివుడికీ ప్రీతికరమైనదే. శివంశ అయిన రుద్రుల సంఖ్య ఏకాదశం(11) అందువల్ల ఈ రోజు ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జీవన్ముక్తికి సోపానమని చెబుతారు. అమృతం కోసం దేవతలు, దానవులు క్షీరసాగరాన్ని చిలకడం ప్రారంభించిన రోజు కాబట్టి ఈ మాస శుక్లపక్ష ద్వాదశికి చిలుకు(క్షీరాబ్ది) ద్వాదశి అని పేరు. బృందా ద్వాదశి అని కూడా అంటారు. బృంద అంటే తులసి. ఉసిరి చెట్టు కింద తులసి మొక్కను ఉంచి పూజిస్తారు.

ఈ రోజున ఉసిరి విష్ణు రూపం, తులసి లక్ష్మి రూపం. రెండింటిని కలిపి పూజించడం వలన ఆదిదంపతులను పూజించిన ఫలితం అంటారు. స్థితి కారకుడైన విష్ణువు, లయ కారకుడైన శివుని పూజించే రోజు కార్తీక శుద్ధ చతుర్ధశి.దీనికి వైకుంఠ చతుర్దశి అని పేరు. ఈ రోజు శివార్చన వలన అధిక ఫలితం ఉంటుందని నమ్ముతారు. త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించిన రోజు కాబట్టి ఈ మాసపూర్ణిమకి 'త్రిపురపూర్ణిమ' అని పేరు. ముత్తైదువులకు అతి ముఖ్యమైన రోజు ఈ కార్తీక పూర్ణిమ. కుటుంబం వృద్ధి చెందాలని, ఐదోతనం చల్లగా ఉండాలనే దృష్టి తో ఈ రోజు నోము నోచుకుంటారు. ఈ రోజుకి దేవ దీపావళి అని మరో పేరు ఉంది. శివాలయాల్లో జ్వాలాతోరణంను ఏర్పాటుచేసి, శివపార్వతులను పల్లకిలో ఉంచి జ్వాలాతోరణం కింద నుంచి మూడు సార్లు దాటిస్తారు.

నూతన గృహ నిర్మాణం చేపడితే ధనధాన్య వృద్ధి

ఈ మాసంలో నూతన గృహ నిర్మాణం చేపడితే ధనధాన్య వృద్ధి ఉంటుందని మత్స్య పురాణం చెబుతుంది. శక్త్యానుసారం సహస్ర లింగార్చన (1000), మహాలింగార్చన(360), అష్టోత్తర లింగార్చన(108), లేదా ఏకాదశ లింగార్చన(11), వీలుకాక ఏకలింగార్చన చేయాలనేది శాస్త్రవచనం. ఇలాచేస్తే బిల్వ దళాలు, వివిద రకాల పుష్పాలు, విభూది, చెరకురసం, తేనెలలో ఉన్న ఔషధ గుణాలు ఒంటికి చేరతాయనేది అంతర్గత భావన. ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉండి, ఒక్కొక్క పూజలో ఒక్కొక్క ఆరోగ్య సూత్రాన్ని కలిగి ఉండి ఇంతగా ఆధ్యాత్మికమైనటువంటి మాసం సంవత్సరం లో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.
-

కార్తీకంలో ఇవి పాటించాలి

ఈ కార్తీక మాసంలో ప్రాతఃకాల శిరస్నానం ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఆ తరువాతది 'నక్తం'(పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనము చేసుకొని భోజనం చేయడం). దీని వల్ల జీర్ణకోశం శుభ్రపడుతుంది. నెలంతా కాకపోయినా సోమవారం చేస్తే మంచిది. తులసి,మారేడు పత్రితో శివుడిని పూజించడం, ఉసిరికాయను వేరువేరు రూపాలలో తినడం ఈ మాస విశిష్ఠత. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే. పురాణ పఠనం చేయాలనేది మరొక విధి అయితే, యథాశక్తిగా దానమాచరించాలనేది మరొక విధి. మరో ముఖ్య క్రియ దీప ప్రజ్వలనం. స్నానాంతరం ఇంటిలోను, దేవుని పీఠం వద్ద, తులసి కోట దగ్గర, ద్వారానికి ఇరు వైపులా,శివాలయాల్లో, విష్ణు ఆలయాలలో, ఆకాశదీపం పేరుతో అఖండ జ్యోతి పేరుతో దీపాలను వెలిగిస్తారు.

 టి. సంయుక్తా కృష్ణమూర్తి
కరీమబాద్, వరంగల్, తెలంగాణ