ప్రకృతిలో ఎన్నో వింతలు దాగి ఉంటాయి. అలాంటి అరుదైన పుట్టగొడుగును అమెరికాలోని ఫ్లోరిడా చిత్తడి నేలల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకే పుట్టగొడుగులో మత్తును కలిగించే సైలోసైబిన్తో పాటు ప్రాణాంతక విషం అమాటాక్సిన్ ఉండటం విశేషం. ఇప్పటివరకు ఈ రెండు సమ్మేళనాలు ఒకే జాతిలో ఉన్నట్లు నిరూపితం కాలేదని పరిశోధకులు తెలిపారు. 2025లో ఫ్లోరిడాలోని నాచు కప్పిన చెట్ల తొర్రలపై పెరుగుతున్న ఈ పుట్టగొడుగును ఆండ్రూ కునిక్ గుర్తించారు.
యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పరిశోధకులు దీనికి ‘గాలెరినా ఇండికా’ అని పేరు పెట్టారు. ఈ రెండు సమ్మేళనాలు ఒకే జాతిలో ఎలా ఏర్పడ్డాయన్నది ఇంకా అంతుచిక్కడం లేదు. పూర్వీకుల డీఎన్ఏ ఇతర జాతులతో మార్పిడి జరగడం దీనికి కారణమై ఉండవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఫంగస్ రసాయన శాస్త్రంలో ఊహించని వైవిధ్యాన్ని వెల్లడిస్తోందని మైకాలజిస్ట్ ఆన్ ప్రింగిల్ పేర్కొన్నారు. అయితే ఈ పుట్టగొడుగును నిపుణులు సైతం గుర్తించడం కష్టమని, తెలియని పుట్టగొడుగులను ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
