ఓయూ విద్యార్థి నుంచి జువాలజీ ప్రొఫెసర్ దాకా.. డాక్టర్ చెల్మల శ్రీనివాసులు స్ఫూర్తిదాయక ప్రయాణం

ఓయూ విద్యార్థి నుంచి జువాలజీ ప్రొఫెసర్ దాకా.. డాక్టర్ చెల్మల శ్రీనివాసులు స్ఫూర్తిదాయక ప్రయాణం

ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా అడుగుపెట్టారు.. అదే యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్‌‌గా ఎదిగారు. తరగతి గది నుంచి అడవుల దాకా, విద్యార్థి దశ నుంచి జీవవైవిధ్య నిపుణుడి దాకా సాగిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. ఆయనే ఓయూ జువాలజీ ప్రొఫెసర్ డాక్టర్ చెల్మల శ్రీనివాసులు. వైల్డ్‌‌లైఫ్ బయాలజీ అండ్ ట్యాక్సానమీ ల్యాబ్ అధిపతిగా, ఓయూ నేచురల్ హిస్టరీ మ్యూజియం క్యూరేటర్‌‌గా, సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ స్టడీస్ డైరెక్టర్‌‌గా, తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు, స్టేట్ వైల్డ్‌‌లైఫ్ బోర్డు సభ్యుడిగా సేవలందిస్తున్నారు. గబ్బిలాలు, సరీసృపాలు, ఉభయచరాలపై విస్తృత పరిశోధనలతో లినియన్ సొసైటీ ఆఫ్ లండన్, జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ ఫెలోగా గుర్తింపు పొందారు. పుస్తకాలకే పరిమితం కాకుండా అడవుల్లో వన్యప్రాణుల జాడలు వెతుకుతున్న ఆయన ప్రయాణం ఆయన మాటల్లోనే..

‘‘మాది మేడ్చల్ దగ్గరి కిష్టాపురం. నాన్న సైన్యంలో పనిచేయడంతో నా బాల్యమంతా ఆర్మీ కంటోన్మెంట్లలో పచ్చని అడవుల మధ్యే గడిచింది. కోతులు, పాములు, కొండెంగలు, జింకలు, నెమళ్లు, రకరకాల పక్షులను చూస్తూ పెరిగాను. అదే వన్యప్రాణులపై ఆసక్తిని పెంచింది. కేంద్రీయ విద్యాలయంలో స్కూలింగ్ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి ఏవీ కాలేజీలో జువాలజీలో బీఎస్సీ చదివాను. 1995లో ఉస్మానియాలో ఎంఎస్సీ పూర్తి చేసి, జింకలపై పరిశోధనతో అక్కడే పీహెచ్‌‌డీ పొందాను. కొంతకాలం ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేశాక 2007లో తిరిగి ఉస్మానియాలో అధ్యాపకుడిగా చేరాను. విద్యార్థిగా అడుగుపెట్టిన ప్రాంగణంలోనే ప్రొఫెసర్‌‌గా ఎదుగుతానని అప్పుడు ఊహించలేదు.

తెలంగాణ ప్రకృతిలో అద్భుతాలు

హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులతో కలిసి తెలంగాణలో 452 పక్షి జాతులను నమోదు చేశాం. ఈ పరిశోధన 2025లో జర్నల్ ఆఫ్ థ్రెటెన్డ్ ట్యాక్సాలో ప్రచురితమైంది. 2024 మార్చిలో వరంగల్ జిల్లా అమ్మవారిపేట చెరువు దగ్గర కనిపించిన రెండు ‘స్పర్ వింగ్డ్ ల్యాప్‌‌వింగ్’ పక్షులు భారతదేశంలోనే తొలి రికార్డు. రాష్ట్రంలో ఉభయచరాలు, సరీసృపాలపై చేసిన పరిశోధనలో 16 ఉభయచరాలు, 40 పాములు, 35 బల్లులు, ఒక మొసలి, ఆరు తాబేళ్లు కలిపి 98 జాతులను నమోదు చేశాం. వీటిలో మూడు బల్లి జాతులు తెలంగాణకే ప్రత్యేకం.

ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌‌పేట పాలరాతి గుట్ట దగ్గర కొద్ది సంఖ్యలో ఇండియన్ వల్చర్లు కనిపిస్తున్నా, వాటి గూడు కట్టే ప్రాంతాలు దెబ్బతిన్నాయి. మంజీరా అభయారణ్యం, దిగువ మానేరు జలాశయం దగ్గర ఇండియన్ స్కిమ్మర్‌‌ను గుర్తించాం. 1987లో సింగూరు దగ్గర 5 వేల డెమోయిసెల్ క్రేన్లు కనిపించాయి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వంటి పక్షులు అంతరించిపోతున్నాయి. 150కి పైగా పరిశోధనా పత్రాలు, 12 పుస్తకాలు రాశాను. 12 కొత్త జీవజాతులను కనుగొన్నాను. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ (ఐయూసీఎన్) వైపర్, బ్యాట్ స్పెషలిస్ట్ గ్రూపుల్లో సభ్యుడిగా, రెడ్ లిస్ట్ ప్రక్రియలోనూ భాగస్వామిగా ఉన్నాను.

ప్రతి జీవీ ఓ లింకే

అడవుల విస్తీర్ణం తగ్గడం, ఆవాసాల విధ్వంసం, వాతావరణ మార్పులతో అరుదైన జీవజాతుల మనుగడ ప్రమాదంలో పడుతోంది. చెరువులు అంతరించిపోవడం, కాలుష్యంతో ఏటా వచ్చే వలస పక్షుల సంఖ్య తగ్గింది. జీవవైవిధ్యానికి సూచికలైన పాలపిట్టలు, పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. కంటికి కనిపించే జీవులే కాదు, కనిపించని చిన్న జీవులకూ ప్రకృతిలో ప్రాధాన్యం ఉంది. ఒక్కో జీవజాతి అంతరిస్తే పర్యావరణ గొలుసులో ఒక్కో లింక్ తెగిపోయినట్టే. జీవజాతులను గుర్తించి, శాస్త్రీయంగా కాపాడి, భావితరాలకు ప్రకృతి సంపదను అందించడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత’’ అని ప్రొఫెసర్ శ్రీనివాసులు అన్నారు. ఒకప్పుడు పాఠాలు నేర్చుకున్న చేతులే ఇప్పుడు ప్రకృతి పాఠాలు నేర్పుతున్నాయి. చదువుకున్న విద్యాసంస్థకే వన్నె తెచ్చిన ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శం.

ఓయూ  స్టూడెంట్ నుంచి జువాలజీ ప్రొఫెసర్ దాకా..
ప్రొఫెసర్ చెల్మల శ్రీనివాసులు స్ఫూర్తిదాయక ప్రయాణం