ఎప్పుడు ఏ బుల్లెట్ తగులుతుందోనని వణుకు.. ప్రాణభయంతో బంకర్లలోకి హాఫిజ్ సయీద్, మసూద్ అజార్

ఎప్పుడు ఏ బుల్లెట్ తగులుతుందోనని వణుకు.. ప్రాణభయంతో బంకర్లలోకి హాఫిజ్ సయీద్, మసూద్ అజార్

న్యూఢిల్లీ: ఎంతో మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, లష్కరే తోయిబా చీఫ్ హాఫిజ్ సయీద్,  జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ బుల్లెట్ తగిలి ప్రాణాలు గాల్లో కలిసి పోతాయోనని హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తమ స్థావరాలను వదిలి పాక్ ఆర్మీ రక్షణలోకి వెళ్లారు. హాఫిజ్ సయీద్, మసూద్ అజార్‌లను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన కొత్త రహస్య స్థావరాలకు తరలించినట్లు భారత ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల పాకిస్థాన్‌లో పలువురు భారత్ వ్యతిరేక ఉగ్రవాదులు అజ్ఞాత సాయుధుల చేతిలో హతమవుతున్నారు. గుర్తు తెలియన వ్యక్తులు చేస్తోన్న ఈ హత్యలు హాఫిజ్ సయీద్, మసూద్ అజార్‎లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏ క్షణాన తమపై దాడి జరుగుతుందోనని.. ఏ వైపు నుంచి బుల్లెట్ దూసుకొస్తుందోనని ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు భయంతో గజగజ వణికిపోతున్నారంట. 

ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాలంటే భయాందోళనకు గురవుతున్నారంట. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ నుంచి మళ్లీ మెరుపు దాడులు జరగవచ్చన్న భయంతో హాఫిజ్ సయీద్, మసూద్ అజార్ గజగజ వణికిపోతున్నారట. ఈ నేపథ్యంలో పాక్ ఐఎస్ఐ వీరిని సేఫ్ హౌస్‎లకు తరలించి రక్షణ కల్పిస్తోందని నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. హాఫిజ్ సయీద్, మసూద్ అజార్‌‎ల భద్రతను పాక్ ఐఎస్ఐ కట్టుదిట్టం చేసిందట.

లష్కర్-ఎ-తైబా అధిపతి సయీద్‌ను లాహోర్‌లోని జోహర్ టౌన్ నుంచి పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న రావల్పిండిలోని గారిసన్ గ్రౌండ్ ప్రాంతానికి తరలించారు. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్​ అజహర్‌ను సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్‌షాలో ఒక సేఫ్ హౌస్‏లో ఉంచినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అజ్ఞాత సాయుధుల దాడుల నేపథ్యంలో వీరూ ప్రత్యక్ష సమావేశాలను నిలిపివేసి కేవలం ఫోన్లు, వర్చువల్‎గానే  అనుచరులతో టచ్‎లో ఉంటున్నారు.

మరోసారి బయటపడ్డ పాక్ కపట బుద్ధి

ప్రపంచదేశాల ముందు పాక్ కపట బుద్ధి మరోసారి బట్టబయలైంది. ఉగ్రవాద నిధుల కేసులో హాఫిజ్ సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడని.. మసూద్ అజార్ ఆచూకీ తెలియదని పాకిస్థాన్ నీతులు వల్లిస్తోంది. కానీ తాజా పరిణామాలతో వీరిద్దరూ ఐఎస్ఐ పూర్తి రక్షణలో విలాసవంతమైన సేఫ్ హౌస్‌లలో ఉంటున్నారని తేలడంతో పాక్ నాటకాలు మరోసారి బయటపడ్డాయి.