అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ డేటింగ్ లైఫ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తన కుమారుడు బారన్ ట్రంప్‌కు డేటింగ్ ప్రపంచంలో మెలకువల గురించి చెప్తూనే కీలక సూచనలు చేశారు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న మెలానియా: ది సిరీస్ (Melania: The Series) అనే డాక్యుమెంటరీలో మెలానియా చెప్పిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
తన కుమారుడు బారన్ ట్రంప్ కు డేటింగ్ లైఫ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బయట ప్రపంచం చాలా ప్రమాదకరమని, అడుగులు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కుమారుడిని హెచ్చరించారు. అదే సమయంలో తల్లిగా తన మద్దతు అతడికి ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇరవై ఏళ్ల బారన్ ప్రైవసీని కాపాడుతూనే, అతడి ఎదుగుదలలో తల్లిగా తన పాత్రను నిర్వర్తిస్తానని చెప్పారు. బయటి ప్రపంచం చాలా ప్రమాదకరమని నేను అతడికి ఎప్పుడూ చెబుతుంటాను. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటానని మెలానియా పేర్కొన్నారు.
మెలానియా, డొనాల్డ్ ట్రంప్ దంపతుల చిన్న కుమారుడైన బారన్ ట్రంప్.. సాధారణంగా పబ్లిక్ లైఫ్ కు దూరంగా ఉంటారు. అయితే తమ మధ్య కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా ఉంటుందని మెలానియా తెలిపారు. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడంలో అతడికి ఎప్పుడూ తోడుగా ఉంటానని చెప్పారు. నేను ఎప్పుడూ తన పక్షాన ఉంటాను. మా మధ్య అన్ని విషయాలపై చర్చ జరుగుతుంది. నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికీ బారన్ ట్రంప్ మాత్రమే.. అది అతడికి కూడా తెలుసు అని ఆమె వివరించారు. తాను ఒక వెరీ కూల్ మామ్ అని, ఈ విషయాన్ని బారన్‌కు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటానని ఆమె నవ్వుతూ చెప్పారు.
బారన్ వ్యక్తిగత జీవితంపై ఇటీవల ఆసక్తి పెరిగింది. 2025లో న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో డేటింగ్ కోసం బారన్ ఏకంగా ఒక అంతస్తునే కేటాయించినట్లు పేజ్ సిక్స్ (Page Six) పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇంట్లోనే ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అయితే తన రిలేషన్షిప్ గురించి బారన్ ఇప్పటివరకు బహిరంగంగా ఎప్పుడూ స్పందించలేదు.
బారన్ ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జూనియర్ (మూడవ సంవత్సరం) చదువుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బారన్ పబ్లిక్ ఈవెంట్లలో తరచుగా కనిపిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్‌కు కూడా ఆయన హాజరయ్యారు.
జనవరిలో విడుదలైన 'మెలానియా' అనే చిత్రంలో కూడా ఆమె తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బారన్ కు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయని, భవిష్యత్తులో సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ డాక్యుమెంటరీని బ్రెట్ రాట్నర్ దర్శకత్వం వహించారు. 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టడానికి ముందు 20 రోజుల పాటు జరిగిన పరిణామాల ఆధారంగా ఇది తెరకెక్కింది. మెలానియా, డొనాల్డ్ ట్రంప్ 2005 జనవరిలో వివాహం చేసుకున్నారు. వీరికి 2006 మార్చిలో బారన్ జన్మించారు. ఒక తల్లిగా తన కుమారుడిపై ప్రజల దృష్టి ఎక్కువగా పడకుండా కాపాడుతూనే, అతడి వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తున్నట్లు మెలానియా తెలిపారు.
