అరుణ గిరిపై మహా దీపం.. అరుణాచలం కార్తీక దీపం చరిత్ర, విశిష్టత

అరుణ గిరిపై మహా దీపం.. అరుణాచలం కార్తీక దీపం చరిత్ర, విశిష్టత

పంచభూత క్షేత్రాల్లో అగ్నికి ప్రతీక తిరువణ్ణామలై (అరుణాచలం). ఇక్కడ కొండే సాక్షాత్తూ శివ స్వరూపం. శక్తి, శివుడు ఒక్కటే అనే సత్యాన్ని భృంగి మహర్షికి చాటేందుకు శివుడు అర్ధనారీశ్వర రూపం ధరించిన క్షేత్రం ఇదేనని పురాణాలు చెబుతాయి. ఏటా కార్తీక మాసంలో పౌర్ణమి రోజున అరుణాచల కొండ శిఖరంపై వెలిగించే ‘కార్తీక దీపం’ (కార్తిగై దీపం) చూసేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. దీన్ని సర్వాలయ దీపం, జ్ఞాన దీపం, శివ జ్యోతి, పరంజుడర్ అని కూడా పిలుస్తారు. విశ్వాన్ని నడిపించే సర్వోన్నతుడు ఒక్కడే అనే తత్వానికి ఇది ప్రతీక అని భక్తుల నమ్మకం.

ఇదీ మహా దీపం

కొండ శిఖరంపై భారీ గంగాళం (కొప్పరై)లో దాదాపు 2 వేల లీటర్ల నెయ్యి పోసి ఈ దీపం వెలిగిస్తారు. దాదాపు 11 రోజుల పాటు నిరంతరం వెలిగే ఈ జ్యోతి 20 కిలోమీటర్ల దూరం నుంచీ కనిపిస్తుంది. దీపోత్సవం రోజు తెల్లవారుజామున భరణి నక్షత్ర సమయంలో ఆలయంలో ‘భరణి దీపం’ వెలిగించి స్వర్ణ భైరవ సన్నిధిలో ఉంచుతారు. సాయంత్రం దాన్ని కొండ శిఖరానికి తీసుకెళ్లి మహా దీపం వెలిగిస్తారు. ఉత్సవం సందర్భంగా భరణి దీపం, అన్నామలైయార్ దీపం, విష్ణు దీపం, నాటు కార్తిగై దీపం, తోట్ట కార్తిగై దీపం అనే ఐదు రకాల దీపాలు వెలిగిస్తారు. 

మిగతా ఆలయాల్లో కార్తీక దీపం రోజున తాటాకులతో మంట (చొక్కపనై) వెలిగిస్తారు, కానీ తిరువణ్ణామలైలో ఆ సంప్రదాయం లేదు. దీపం వెలగగానే భక్తులు ‘అన్నామలైయారుక్కు అరోహర’ అంటూ నినదిస్తారు. ‘ఈ శరీరమే నేను అనే భావనను నశింపజేసి, మనసును ఆత్మలో లీనం చేసి, అంతర్ముఖంగా అద్వైత ఆత్మజ్యోతిని చూడటమే అసలైన దీప దర్శనం’ అని రమణ మహర్షి చెప్పారు.

భక్తుల విశ్వాసాలు

దీపోత్సవం రోజు కొండను చూసి ‘నమశ్శివాయ’ అంటే ఆ మంత్రాన్ని మూడు కోట్లసార్లు జపించినంత పుణ్యం దక్కుతుందని, దీపాన్ని దర్శించినవారికి 21 తరాల పాటు మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. దీపం వెలిగాక గిరి ప్రదక్షిణ (గిరివలం) చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందని, 14 కిలోమీటర్ల గిరివలాన్ని ఐదుసార్లు (70 కి.మీ.) చేస్తే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతాయి. దీపం వెలిగినప్పుడు కొండ లోపల పూజలు జరుగుతున్న శబ్దం విన్నామని రమణ మహర్షి, శేషాద్రి స్వామి సహా ఎందరో సాధువులు చెప్పారు. 

దీపోత్సవానికి సిద్ధులు వస్తారని, దీపంలో పోసే నెయ్యిలో మూలికా తైలాలు కలుపుతారని, దీపం పొగ దుష్టశక్తులను నాశనం చేస్తుందని విశ్వాసం. దీపోత్సవం మూడో రోజు పంచ మూర్తులు కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీప నాడు శివుడు అగ్నిలో చేసే నృత్యాన్ని ‘ముక్తి నృత్యం’ అంటారు. దీపాన్ని ప్రత్యక్షంగా చూడలేనివారు ఆ సమయంలో మనసులో తలుచుకున్నా ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు.

మూడు భారీ గంటలు

తిరువణ్ణామలై ఆలయంలో శతాబ్దానికి పైగా మూడు పాత భారీ గంటలు ఉన్నాయి. వీటిలో రెండు అన్నామలైయార్ సన్నిధిలో, ఒకటి ఉన్నాములై అమ్మన్ సన్నిధిలో ఉన్నాయి. ఈ మూడు గంటలు మోగితే వాటి శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తుంది.