దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా (Vi), బీఎస్ఎన్ఎల్ వాయిస్ కాల్స్ మాత్రమే ప్రాధాన్యత ఉన్న కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకువచ్చాయి. మొబైల్ డేటా అవసరం లేకుండా కేవలం ఫోన్ కాల్స్, SMSలు మాత్రమే వినియోగించుకునే వారి కోసం ఈ ప్రత్యేక ప్లాన్లను రూపొందించారు. ఫీచర్ ఫోన్ వాడేవాళ్ళు, రెండో సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్స్ వల్ల రీఛార్జ్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 2026 సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలు ఈ మార్పులు చేశాయి. కొత్త నిబంధనల ప్రకారం, టెలికాం సంస్థలు 30 రోజుల వాలిడిటీతో షార్ట్ టర్మ్ వాయిస్, SMS ఓన్లీ స్పెషల్ టారిఫ్ వోచర్లను (STVs) తప్పనిసరిగా అందించాలి. అలాగే, పూర్తి క్యాలెండర్ నెల రోజుల వ్యాలిడిటీ ఇచ్చే రీఛార్జ్ ఆప్షన్‌ను కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచాలని ట్రాయ్ ఆదేశించింది.
ప్రస్తుత మార్కెట్లో ఇతర ఆపరేటర్ల కంటే బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే ఈ సేవలను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ మూడు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిలో రూ.172 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని ఇస్తుండగా, రూ.184 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే రూ.190 రీఛార్జ్‌తో పూర్తి క్యాలెండర్ నెల రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఈ మూడు ప్లాన్లలోనూ ఆన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ప్రైవేట్ ఆపరేటర్లు మొత్తం వ్యాలిడిటీ కాలానికి కేవలం 300 ఎస్ఎంఎస్లు మాత్రమే ఇస్తుండగా, బీఎస్ఎన్ఎల్ రోజు కోటా కింద అందించడం గమనార్హం. వీటితో పాటు రూ.99, రూ.439 ధరల్లోనూ వాయిస్ ఫోకస్డ్ ప్లాన్లు ఉన్నాయి.
రిలయన్స్ జియో కస్టమర్ల కోసం వివిధ వ్యాలిడిటీతో వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రకటించింది. జియోలో ప్రారంభ ప్లాన్ ధర రూ.147గా ఉంది, దీని వ్యాలిడిటీ 22 రోజులు. మిగిలిన ప్లాన్లలో రూ.177 (28 రోజులు), రూ.196 (30 రోజులు), రూ.197 (క్యాలెండర్ నెల) ప్లేన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ప్లాన్లలో ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి, కానీ ఇంటర్నెట్ డేటా ఉండదు. ఎక్కువ రోజులు వాలిడిటీ కావాలనుకునే వారి కోసం రూ.448 ప్లాన్ (84 రోజులు, 1,000 ఎస్ఎంఎస్), రూ.1,748 ప్లాన్ (336 రోజులు, 3,600 ఎస్ఎంఎస్) ప్రీపెయిడ్ ప్లాన్లను జియో అందిస్తోంది. వీటితో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ యాక్సెస్ కూడా ఉంటుంది.
ఎయిర్టెల్ 2026 అక్టోబర్‌లో కొత్త వాయిస్ ప్లాన్లను ప్రారంభించగా, వోడాఫోన్ ఐడియా కూడా అదే ధరలతో ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు కంపెనీలు రూ.185 ప్లాన్ (28 రోజులు), రూ.203 ప్లాన్ (30 రోజులు), రూ.206 ప్లాన్ (క్యాలెండర్ నెల) ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. వీటిలో ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఎయిర్టెల్ ముఖ్యంగా ప్రతి 30 రోజులకు ఒక హలో ట్యూన్ మార్చుకునే సదుపాయం కల్పిస్తోంది. అలాగే 84 రోజుల వ్యాలిడిటీ కోసం ఎయిర్టెల్ రూ.469 ప్లాన్ (900 ఎస్ఎంఎస్), వోడాఫోన్ ఐడియా రూ.470 ప్లాన్ ఆఫర్ చేస్తున్నాయి. ఏడాది వాలిడిటీ సంబంధించి ఎయిర్టెల్ రూ.1,849 ధరతో 3,600 ఎస్ఎంఎస్లు ఇచ్చే ప్లాన్ అందిస్తుండగా... వోడాఫోన్ ఐడియా రూ.179కే 25 రోజుల వ్యాలిడిటీ, 300 ఎస్ఎంఎస్లు ఇస్తోంది.
ధరలు, ఎస్ఎంఎస్ ప్రయోజనాల పరంగా చూస్తే బీఎస్ఎన్ఎల్ మిగిలిన వాటికంటే ముందు ఉంది. బీఎస్ఎన్ఎల్ రూ.172 ప్లాన్ ధర జియో (రూ.177) ప్లాన్, ఎయిర్టెల్ ప్లాన్, వోడాఫోన్ ఐడియా (రూ.185) ప్లాన్ల కంటే తక్కువగా ఉండటం విశేషం. ఈ ప్లాన్ల పై టెలికాం కంపెనీలు స్పందిస్తూ, కస్టమర్లు వారి అవసరాలకు తగ్గట్టుగా ఖర్చులను కంట్రోల్ చేసుకోవడానికే ఈ డేటా లేని ప్లాన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నాయి.
