TR నంబర్ లేకుండానే కొత్త బైక్.. కొన్న వారానికే యజమాని మృతి..షోరూం ముందు నిరసన

TR నంబర్ లేకుండానే కొత్త  బైక్.. కొన్న వారానికే యజమాని మృతి..షోరూం ముందు నిరసన

జనగామ జిల్లా: కొత్త వాహనం కొనుగోలు చేసిన వారం రోజులకే జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, వాహనానికి టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్) నంబర్ లేకపోవడంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురైందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జనగామలో ఉద్రిక్తతకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే.. జనగామకు చెందిన ఐల వెంకటేశ్వర్లు ఇటీవల శ్రీనివాస హోండా షోరూంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేశారు. అయితే షోరూం నిర్వాహకులు టీఆర్ నంబర్ లేకుండానే వాహనాన్ని డెలివరీ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాహనం కొనుగోలు చేసిన వారం రోజులకే జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్వర్లు మృతి చెందారు.

ప్రమాదం అనంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ప్రయత్నించగా, వాహనానికి టీఆర్ నంబర్ లేకపోవడంతో క్లెయిమ్ నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో షోరూం నిర్వాహకుల నిర్లక్ష్యమే తమ కుటుంబానికి నష్టం కలిగించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో మృతుడి కుటుంబ సభ్యులు జనగామలోని శ్రీనివాస హోండా షోరూం ఎదుట హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, జరిగిన నష్టానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, షోరూం నిర్వాహకుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.