చుక్కారామయ్య 101వ జన్మదినం...ఇంటికెళ్లి విషెస్ చెప్పిన సీఎం రేవంత్

చుక్కారామయ్య 101వ జన్మదినం...ఇంటికెళ్లి విషెస్ చెప్పిన సీఎం రేవంత్

శతవసంతాలను పూర్తి చేసుకున్న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి  ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చుక్కా రామయ్య  జన్మదినోత్సవం తెలంగాణ ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని ఈ సందర్భంగా  సీఎం  వ్యాఖ్యానించారు.

 స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన రామయ్య  ఐఐటీ అనే పదాన్ని ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త అని కొనియాడారు. విద్యావేత్తగానే కాకుండా శాసనమండలిలో సభ్యుడిగా కూడా ఈ ప్రాంతంపై తనదైన ముద్రను వేశారని అన్నారు.

చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారితో కలిసి పనిచేశానని గుర్తుచేస్తూ ఆ విషయాన్ని తాను గొప్పగా చెప్పుకుంటానని, అదృష్టంగా భావిస్తానని అన్నారు. శాసనమండలిలో సామాజిక సమస్యలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా సమస్యలకు పరిష్కారం కూడా సూచించే వారని గుర్తుచేశారు. 

 చుక్కా రామయ్య శాసనమండలిలో ప్రస్తావన చేసేంత వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజీ లేదన్న విషయం ఎవరికీ తెలియదని, వారు ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. 

ALSO READ : పెళ్లికి బెస్ట్ ముహూర్తం .. 25 రోజుల్లో 11 రోజులే శుభం.

కాలానికి, రాజకీయాలకు చుక్కా రామయ్య లాంటి వారు అతీతులని, వారు ఆయురారోగ్యాలతో అందరికీ స్ఫూర్తినివ్వాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు. చుక్కా రామయ్యఆలోచనలు, సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి అన్నారు.