టిక్‎టాక్ మాదిరి ఓలా, ఉబెర్‎ను ఎందుకు నిషేధించరు: కేంద్రానికి ఆటో, టాక్సీ డ్రైవర్ల ప్రశ్న 

టిక్‎టాక్ మాదిరి ఓలా, ఉబెర్‎ను ఎందుకు నిషేధించరు: కేంద్రానికి ఆటో, టాక్సీ డ్రైవర్ల ప్రశ్న 

న్యూఢిల్లీ: భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు గురువారం (నవంబర్ 19) ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిరసన చేపట్టాయి. ఆటో, టాక్సీ ఛార్జీలను పెంచాలని, ప్రైవేట్ బైక్ ట్యాక్సీలను నిషేధించాలని డిమాండ్ చేశాయి. వాహన ఫిట్‌నెస్ నిబంధనల నుంచి ఉపశమనం కలిగించాలని, అలాగే డ్రైవర్ల భద్రత, వేతనాలను మెరుగుపరచాలని కోరారు. 

ఓలా, ఉబెర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులతో తమ జీవనాధారం దెబ్బ తింటుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో టిక్‎టాక్ వంటి విదేశీ యాప్‎లను నిషేధించినప్పుడు.. తమ పొట్టకొడుతోన్న ఓలా, ఉబెర్ లాంటి విదేశీ కంపెనీలను ఎందుకు బ్యాన్ చేయరని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేట్ బైక్ ట్యాక్సీలను నిషేధించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. 

ప్రయాణికుల జేబులకు చిల్లు

ఢిల్లీ-ఎన్‌సీఆర్, పంజాబ్, హర్యానాలలో గురువారం (నవంబర్ 19) ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ల సమ్మె ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడింది. సమ్మె కారణంగా క్యాబ్, ఆటో ఛార్జీలు భారీగా పెరిగాయి. సాధారణంగా రూ.300 ఉండే ప్రయాణ ఛార్జీలు రద్దీ సమయాల్లో రూ.800 దాటాయి. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్‌లలో సర్జ్ ప్రైసింగ్ విపరీతంగా పెరిగింది. 

సాధారణ రోజుల్లో దక్షిణ ఢిల్లీ నుంచి నోయిడా ఫిల్మ్ సిటీకి రూ.300 ఉండే క్యాబ్ ఛార్జీ ఏకంగా రూ.803కు చేరింది. రద్దీ లేని సమయాల్లో కూడా క్యాబ్, ఆటో ఛార్జీలు కనీసం 30 శాతం మేర పెరిగాయి. పలు చోట్ల డ్రైవర్లు రైడ్‌లను రద్దు చేయడం, యాప్‌లో చూపించిన దానికంటే ప్రయాణికుల నుంచి అదనపు డబ్బు డిమాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.