చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అధికార టీవీకే పార్టీకి చెందిన కొలత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వి.ఎస్. బాబు హఠాన్మరణం చెందారు. గురువారం (నవంబర్ 19) చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో శ్వాసకోశ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని ఆసుపత్రి ధృవీకరించింది.
2026 ఎన్నికల్లో.. తమిళనాడు రాష్ట్రం కొలత్తూరు నియోజకవర్గం నుంచి సీఎం హోదాలో డీఎంకే పార్టీ నుంచి ఎంకే స్టాలిన్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో హీరో విజయ్ టీవీకే పార్టీ నుంచి వీఎస్ బాబు బరిలోకి దిగారు. స్టాలిన్ విజయం ఖాయం అని అందరూ భావించారు. ఫలితాల్లో అనూహ్యంగా టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో.. స్టాలిన్ ఓడిపోయారు. 8 వేల 795 ఓట్ల మెజార్టీతో వీఎస్ బాబు గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెట్టారు. దేశ వ్యాప్తంగా స్టాలిన్ ఓటమి సంచలనం కాగా.. గెలిచిన వీఎస్ బాబు హీరో అయ్యాడు.
వీఎస్ బాబు బ్యాగ్రౌండ్ ఇదే
వీ.ఎస్. బాబు టీవీకేలో కీలక నేత. చెన్నైకి చెందిన సీనియర్ పొలిటీషియన్. అర్బన్‌లో ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన ప్రస్తుతం టీవీకేకు సంయుక్త ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వీఎస్ బాబు వయసు 75 సంవత్సరాలు. విజయ్ టీవీకే పార్టీ.. కొలత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్‌కు వ్యతిరేకంగా బాబును తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. టీవీకేలో చేరకముందు.. ఈ వీఎస్ బాబు ఏఐఏడీఎంకేలో ఉన్నారు.
అన్నాడీఎంకేలో ఆయన 2006 నుంచి 2011 వరకు చెన్నై కార్పొరేషన్లో కీలక పదవులతో సహా పలు కీలక పదవులను నిర్వహించారు. అంతేకాదు.. డీఎంకేలో కూడా ఆయన పనిచేశారు. ఉత్తర చెన్నై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే ఎమ్మెల్యేగా కూడా వీఎస్ బాబు పనిచేశారు. ఆయన చదువుకుంది 8వ తరగతి వరకూ మాత్రమే. వీఎస్ బాబు వెల్లడించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 3.7 కోట్లు. సీఎంను ఓడించి వీఎస్ బాబు చరిత్ర సృష్టించారు.
డీఎంకే పార్టీ చరిత్రలోనే మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితిని చవిచూడలేదు. ఉత్తర చెన్నైలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కొలత్తూరు ఒకటి. ఈ నియోజకవర్గం అధికార డీఎంకేకు నిన్నమొన్నటి దాకా కంచుకోటగా ఉంది. డీఎంకే అధ్యక్షుడిగా కూడా ఉన్న స్టాలిన్, 2011 నుంచి ఈ సీటులో ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.
2021 ఎన్నికల్లో..ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆది రాజారామ్‌ను 70 వేల 384 ఓట్ల తేడాతో ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఈ కీలకమైన స్థానంలో ఓటింగ్ శాతం 2021లో 61.68 శాతం కాగా.. 2026లో 86.12 శాతానికి గణనీయంగా పెరిగింది. ఇంత ఓటింగ్ శాతం పెరిగినప్పుడే విజయ్ టీవీకే పార్టీకి ఈ నియోజకవర్గంలో సానుకూల పవనాలు వీచాయని ఈ ఫలితాలతో తేటతెల్లమైంది.
