మనిషి అన్నవాడు మాయం అవుతున్నాడమ్మా అనే దానికి ఇది ఉదాహరణ. ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె స్థానికులకు ఎంతో సుపరిచితురాలు. ఈ క్రమంలోనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించటానికి ఎవరూ లేరు. తెలిసిన వాళ్లకు సమాచారం ఇస్తే ఎవరూ రాలేదు. ఈ క్రమంలోనే స్థానికులు వారం రోజులుగా ఆమెకు అంత్యక్రియలు నిర్వహించకుండా.. డెడ్ బాడీని ఫ్రీజ్ చేసి ఉంచారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల కోసం వారం రోజులు వెయిట్ చేసినా ఎవరూ రాకపోవటంతో.. పేపర్లలో ప్రకటన ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మీ అమ్మ చనిపోయింది. ఎక్కుడున్నా వెంటనే రండి అంటూ ఆమె పిల్లలకు, బంధువులకు తెలిసే విధంగా ఫొటోతో సహా ప్రకటన ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ అయ్యింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైకి చెందిన లలితా కృష్ణమూర్తి అనే వృద్ధురాలు నవంబర్ 13న ముంబైలో కన్నుమూశారు. అయితే ఆమె మరణించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ అక్కడ లేరు. ఆమెకు పిల్లలు ఉన్న.... వారి ఆచూకీ తెలియకపోవడంతో అంత్యక్రియలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఆమె కుటుంబికుల కోసం అధికారులు వార్తాపత్రికలో ప్రత్యేక ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
పిల్లలు, బంధువుల కోసం వార్తాపత్రికలో ప్రకటన
లలితా కృష్ణమూర్తి మరణించినప్పటికీ ఆమె పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియకపోవడంతో సంబంధిత అధికారులు వారి కోసం వెతుకుతున్నారు. ఆమె పిల్లలు, దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు లేదా ఆమె గురించి తెలిసిన ఎవరైనా తమను సంప్రదించాలని వార్తాపత్రికలో ప్రచురించిన ప్రకటనలో కోరారు. ఒక వృద్ధురాలు చనిపోయిన తర్వాత ఆమెకు చివరి వీడ్కోలు చెప్పేందుకు కూడా కుటుంబ సభ్యులు లేకపోవడం పలువురిని కలచివేస్తోంది.
40 ఏళ్లుగా ఒంటరిగానే జీవనం.. సోషల్ మీడియాలో సంచలన చర్చ
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది స్పందిస్తున్నారు. కిషోర్ సుబ్రమణియన్ అనే ఎక్స్ (ట్విట్టర్) వినియోగదారుడు ఈ ప్రకటనలో ఉన్న ఫోన్ నంబర్లలో ఒకదానికి కాల్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లలితా కృష్ణమూర్తి గత 40 ఏళ్లుగా ఒంటరిగానే జీవిస్తున్నారు. ఆమె మరణించిన తర్వాత అదే భవనంలో నివసించే పక్కింటి వారు ముందుకు వచ్చి అవసరమైన అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. ఈ విషయంపై కిషోర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పిల్లల నవ్వులతో కళకళలాడిన ఇళ్లు.. ఇప్పుడు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తోడుగా టీవీ మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చిందని అన్నారు.
►ALSO READ | టీవీ డిబేట్‌లో బిగ్ ఫైట్.. పిడిగుద్దులు, తన్నులతో జర్నలిస్ట్, విశ్లేషకుడి మధ్య కొట్లాట.. ప్రసారం చేసిన పబ్లిక్ ఛానల్!
"పిల్లలు మంచి భవిష్యత్తు కోసం ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లిపోతున్నారు. కానీ, ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం ఒంటరిగానే మిగిలిపోతున్నారు. చివరకు వారు చనిపోయినప్పుడు చివరి వీడ్కోలు చెప్పడానికి కూడా పిల్లలు తిరిగి రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి" అంటూ తన ఆవేదనను పంచుకున్నారు. ఉద్యోగాలు, కెరీర్ కోసం యువత పెద్ద సంఖ్యలో ఇతర నగరాలకు, విదేశాలకు వలస వెళ్లడం వల్ల వృద్ధులైన తల్లిదండ్రులు ఒంటరిగా జీవించాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
విదేశాల్లో ఉన్న పిల్లలు రాలేకపోతే పరిస్థితి ఏంటి?
ఈ ఘటనపై మరో సోషల్ మీడియా వినియోగదారుడు తనకు తెలిసిన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. మా మాజీ బాస్ చెప్పిన విషయం ప్రకారం.. ఆయనకు తెలిసిన వారిలో కనీసం ఇద్దరు, ముగ్గురు వృద్ధుల అంత్యక్రియలను వారి పిల్లలు విదేశాల నుంచి సమయానికి రాలేకపోవడంతో ఆయన కుటుంబమే నిర్వహించిందని తెలిపారు. అయితే, దీనిపై మరో వ్యక్తి స్పందిస్తూ.. పిల్లలు ఎంత దూరంలో ఉన్నప్పటికీ తల్లిదండ్రుల చివరి ప్రయాణంలో పాల్గొనాలనే ఆలోచన, సంకల్పం ఉంటే ఏదో ఒక మార్గం వెతుక్కోవచ్చని అన్నారు.
మరికొందరు ఈ ఘటనను సమాజంలోని చీకటి కోణంగా అభివర్ణించారు. వృద్ధాప్యంలో ఉన్నవారిని పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు అవసరమైన సహాయం, వైద్య సదుపాయాలు, భద్రత కల్పించేలా ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలను కోరారు.
దేశంలో పెరుగుతున్న ఒంటరి వృద్ధుల సంఖ్య
లలితా కృష్ణమూర్తి ఘటన ఒక్కటే కాదు.. దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వృద్ధులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు తగ్గిపోవడం, పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, నగరాల్లో చిన్న కుటుంబాలు పెరగడం వంటి కారణాలతో వృద్ధులు ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా (LASI) గణాంకాల ప్రకారం.. దేశంలో 60 ఏళ్లు పైబడిన వారిలో సుమారు 5.7 శాతం మంది పూర్తిగా ఒంటరిగా నివసిస్తున్నారు.
గతంలో ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఉండేవారు. ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే కుటుంబ సభ్యులు అండగా నిలిచేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పిల్లలు చదువులు, ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు, దేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో వృద్ధులైన తల్లిదండ్రులు వారి పనులు వారే చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నారు. 2011లో సుమారు 2 శాతంగా ఉన్న ఒంటరిగా నివసించే వృద్ధుల సంఖ్య ఇప్పుడు 5.7 శాతానికి చేరినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
చివరి రోజుల్లోనైనా తోడు కావాలి కదా!
పిల్లలు ఉన్నత చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, జీవితంలో ఎదగాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ, వారి కోసం జీవితమంతా కష్టపడిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పూర్తిగా ఒంటరిగా వదిలేయకూడదనే అభిప్రాయం ఈ ఘటనతో మరోసారి చర్చకు వచ్చింది. వృద్ధులకు కావాల్సింది ఎప్పుడూ డబ్బు, ఖరీదైన బహుమతులు మాత్రమే కాదు. అప్పుడప్పుడు పలకరించే మనిషి, అనారోగ్యంగా ఉన్నప్పుడు చూసుకునే ఆప్తులు, కష్టాల్లో అండగా నిలిచే కుటుంబ సభ్యులు కూడా అవసరం.
లలితా కృష్ణమూర్తి ఘటన సమాజానికి ఒక ప్రశ్నను సంధిస్తోంది. మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, మన కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులను మరిచిపోతున్నామా ? వారు బతికున్నప్పుడు తోడుగా ఉండలేకపోయినా, కనీసం చివరి చూపు చూసేందుకు కూడా రాలేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమాజం సమాధానం వెతుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This is a tragic advertisement where a lady has passed away and no one knows where her daughters or relatives are, so that they can be contacted for performing the funeral rites. Similar situations are faced by those whose children are abroad and are unable to come at short notice. My ex-boss tells me that his family performed the final rites of at least 2-3 old parents of their friends as they were unable to come from another country. This was a little more common during the COVID times. #death #families
— Ananth Rupanagudi (@AnanthOnTrack) November 19, 2026
