Mohammed Siraj: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు చోటు దక్కకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ (Sitanshu Kotak) స్పందించారు. సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పుడు నిర్ణయం కాదని, కేవలం తొలి రోజును మాత్రమే కాకుండా ఐదు రోజుల ఆటను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ తుది జట్టును ఎంపిక చేశామని తేల్చి చెప్పారు. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లతో కూడిన పేస్ దళాన్ని బరిలోకి దించడంపై కొటక్ క్లారిటీ ఇచ్చారు.
సిరాజ్ స్థానంలో కాంబోజ్.. సుందర్ ఎంపిక వెనుక కారణం ఇదే:
* ఐదు రోజుల ప్రణాళిక: సిరాజ్ విషయంలో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేదు.. మేము జట్టును ఎంపిక చేసినప్పుడు ఇదే బెస్ట్ XI అని భావించాం.. సిరాజ్‌ను తప్పించడం తప్పు నిర్ణయమని నేను అనుకోవడం లేదు.. ఇది కేవలం మొదటి రోజు మాత్రమే.. మేము 2, 3, 4వ రోజులను కూడా దృష్టిలో పెట్టుకుని జట్టును సెలక్ట్ చేసుకుంటామని సితాంశు కొటక్ తెలిపారు.
* వాషింగ్టన్ సుందర్ ఎందుకంటే: న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌లో నలుగురు లెఫ్ట్ హ్యాండ్ (Left-handed) బ్యాటర్లు ఉండటం వల్లే స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపామని, ఈ మ్యాచ్‌కు ఇదే అత్యుత్తమ బౌలింగ్ అటాక్ అని ఆయన సమర్థించుకున్నారు.
కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌పై కోచ్ ఏమన్నారంటే?:
30వ ఓవర్ తర్వాత కుకబుర్రా బంతి మెరుపు తగ్గడంతో భారత బౌలర్లు వికెట్ల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. హెన్రీ నికోల్స్ (113*), గ్లెన్ ఫిలిప్స్ (94*) అజేయ భాగస్వామ్యంతో కివీస్ 243/5 స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో బౌలర్ల ప్రదర్శనపై కొటక్ మాట్లాడుతూ.. గంటకు 126–130 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న అన్షుల్ కాంబోజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మూడో స్పెల్‌లో మాత్రమే వేగం కీలకమవుతుందని కొటక్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ ఒక అటాకింగ్ బౌలర్, అతడు కొన్ని పరుగులు ఇస్తాడని తమకు తెలుసు.. వికెట్లు తీసినప్పుడు ఇష్టపడి, రన్స్ ఇస్తే విమర్శించడం సరికాదని కొటక్ సపోర్ట్ చేశాడు. ఎండ ఎక్కువగా ఉండటంతో పిచ్‌పై తేమ త్వరగా ఆరిపోయిందని, కొత్త బంతితోనే బౌలర్లకు ఎక్కువ సహాయం లభించిందని కివీస్ బ్యాటర్ల పోరాటాన్ని కోచ్ సింతాశు కొటక్ అభినందించారు.
►ALSO READ | ఐపీఎల్ మినీ వేలంలో ఈ ఐదుగురు స్టార్లకు జాక్‌పాట్.. భారీ ధర పలకడం పక్కా?
