కాగితంపై చూస్తే లైఫ్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్లే కనిపిస్తుంది. చేతినిండా జీతం, క్రమం తప్పని ఫిట్నెస్ రొటీన్, బ్యాంకులో రూ.కోటికి పైగా సేవింగ్స్. అయినా సరే.. భవిష్యత్తుపై బెంగతో నిద్రలేని రాత్రులు గడుపుతూ డైలమాలో ఉన్నాడు ఒక టెక్కీ. విదేశాలకు వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే బలమైన కోరిక ఒకవైపు.. కష్టపడి కూడబెట్టిన కోటి రూపాయలను పణంగా పెట్టాల్సి వస్తుందేమోనన్న భయం మరోవైపు అతన్ని వెంటాడుతున్నాయి. ఈ రెంటి మధ్య నలుగుతున్న భారతీయ టెక్కీ రెడిట్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
'r/developersIndia' కమ్యూనిటీలో ఆ ఉద్యోగి తన మనసులోని ఆందోళనను పంచుకున్నారు. భారత్‌లో మంచి ఆదాయం ఉన్నప్పటికీ.. విదేశాలకు వెళ్లి సెటిల్ కాలేకపోయినందుకు బాధపడుతున్న సీనియర్లు, టీమ్ లీడ్‌ల మాటలు ఈయనలో విదేశీ మోజును మరింత పెంచాయి. "ఎలాగైనా ఇండియా వదిలి వెళ్లాలని ఉంది, కానీ సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను" అంటూ తన తడబాటును బయటపెట్టాడు సదరు టెక్కీ. పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేని ఈ టెక్కీకి విదేశాల్లో మాస్టర్స్ చేయడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద ప్రమాదంలా అనిపిస్తోందట. ఒకవేళ సేవింగ్స్ ఖాళీ చేసుకుని తిరిగి ఇండియా రావాల్సి వస్తే.. 30 ఏళ్ల వయసులో సున్నా నుంచి మొదలుపెట్టాల్సి వస్తుందని, దానికి తోడు పెళ్లి తలనొప్పులు తోడవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ధైర్యంగా ముందడుగు వేయమని ప్రోత్సహించారు. 31 ఏళ్ల వయసులో పెళ్లయ్యాక అమెరికా వెళ్లి.. మొదటి నుంచి జీవితాన్ని నిర్మించుకున్న ఒక యూజర్.. "యూత్ లో ఉన్నప్పుడే కలల వెంట పరుగెత్తు.. 30-40ల్లో వెళ్లడం మరింత కష్టం" అని సూచించారు. మరో యూజర్ అయితే రూ. కోటి పొదుపుతో కనీసం 3-4 ఏళ్లు నిలదొక్కుకోవచ్చని.. ఇదే సరైన సమయమని ధైర్యం చెప్పారు. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకుండా సైకాలజిస్ట్‌ను కలవమని కూడా ఒకరు సూచించారు.
►ALSO READ | భారత్‌లో సేల్స్‌ఫోర్స్ లేఆఫ్స్: ఎగ్జిట్ ప్యాకేజీలపై ఉద్యోగులు పోస్టులు!
విదేశీ ఉద్యోగాల విషయంలో వాస్తవ పరిస్థితులను వివరిస్తూ హెచ్చరించిన వారూ ఉన్నారు. 2022 తర్వాత పరిస్థితులు మారిపోయాయని.. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలే లేఆఫ్‌లు, వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలు ఇస్తున్నాయని గుర్తుచేశారు. యూకేలో డేటా సైన్స్, ఏఐలో మాస్టర్స్ పూర్తి చేసినా.. 2.5 ఏళ్ల అనుభవం ఉన్నా ఇంటర్వ్యూ కాల్స్ రావడం లేదని తిరిగి ఇండియా రావాలనుకుంటున్నట్లు ఒకరు వాపోయారు. సేవ్ చేసుకున్న డబ్బులు మొత్తాన్ని మాస్టర్స్‌లో కుమ్మరించకుండా.. రీలోకేషన్ ఖర్చులు భరించే విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నించడమే తెలివైన నిర్ణయమని మరో నెటిజన్ సూచించారు.
