AI టెక్నాలజీతో ప్రపంచాన్నే షేక్ చేస్తున్న ఆంత్రోపిక్ కంపెనీ మరో రికార్డు సృష్టించింది. స్టాక్ మార్కెట్ లిస్టింగ్ కోసం తెచ్చిన కంపెనీ ఐపీఓ, ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా సుమారు 107.3 బిలియన్ డాలర్లు సమీకరించారు ప్రమోటర్లు. భారత కరెన్సీలో ఈ మెుత్తం విలువ సుమారు రూ.10లక్షల 2వేల కోట్లకు పైగా ఉంటుంది. ఆధునిక 'థింకింగ్ మెషీన్స్' అభివృద్ధి కోసం పబ్లిక్ మార్కెట్లోకి వచ్చిన తొలి ఫ్రాంటియర్ ఏఐ ల్యాబ్‌గా ఆంత్రోపిక్ నిలిచింది.
తాజా ఐపీఓలో కంపెనీ 95కోట్ల 64లక్షల కొత్త షేర్లను, సహ వ్యవస్థాపకులు తమ 2కోట్ల 36లక్షల షేర్లను ఒక్కొక్కటి 83 డాలర్ల చొప్పున అమ్మారు. అంటే భారతీయ రూపాయల్లో షేరు ధర సుమారు రూ.7వేల753గా ఉంటుంది. మెుదట నిర్ణయించిన 70 నుంచి 78 డాలర్ల ధర పరిధిని ఇది మించిపోయింది. తాజా ఐపీఓలో 26 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.43 లక్షల కోట్లు) ప్రైవేట్ ప్లేస్మెంట్ కూడా ఉంది. ఇందులో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, ఏఎండీ, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు పాల్గొన్నాయి. ప్రైవేట్ ప్లేస్మెంట్ లేకుండా చూసినా 81.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7.59 లక్షల కోట్లు) బేస్ ఐపీఓతో స్పేస్ఎక్స్ రికార్డును (75 బిలియన్ డాలర్ల) అధిగమించి భూమిపై కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.
ఈ షేరు ధరతో ఆంత్రోపిక్ పూర్తి విలువ సుమారు 1.5 ట్రిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.140.11 లక్షల కోట్లు) లెక్కగట్టారు. ఇప్పటివరకు చిప్ తయారీ సంస్థలపై ఉన్న దృష్టి ఇప్పుడు క్లాడ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను రూపొందించే సంస్థల వైపు మళ్లుతోందని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. వ్యాపారం, విద్య, ప్రభుత్వం, ఆరోగ్య రంగాల్లో ఇవి కీలకంగా మారుతున్నాయి.
ఈ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో కంపెనీ అమ్మకానికి ఉంచిన షేర్ల కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి. వాల్‌స్ట్రీట్ నుంచి లండన్, టోక్యో వరకు ఇన్వెస్టర్లు ఆంత్రోపిక్ స్టాక్స్ కోసం పోటీ పడ్డారు. నాస్డాక్ గ్లోబల్ సెలెక్ట్ మార్కెట్లో 'ANT' అనే సింబల్‌తో ఇది ట్రేడింగ్ ప్రారంభించనుంది. త్వరలోనే నాస్డాక్ 100 వంటి ఇండెక్స్‌లలో చేరే అవకాశం ఉంది.
మార్కెట్ విలువ పరంగా ఆంత్రోపిక్ ప్రపంచంలోని టాప్ 15 పబ్లిక్ కంపెనీల్లో ఒకటిగా చేరింది. టెస్లాతో సమానంగా నిలుస్తూ.. ఎలీ లిల్లీని అధిగమించింది. ప్రత్యర్థి ఓపెన్ఏఐ 2027 వరకు ఐపీఓకు వచ్చేందుకు ఎలాంటి ప్లాన్స్ లేకపోవడంతో ఆంత్రోపిక్ ముందంజ వేసింది. ఈ లిస్టింగ్ సహ వ్యవస్థాపకులు, ఉద్యోగులతో పాటు ఐకానిక్, కోట్యూ మేనేజ్మెంట్, స్పార్క్ క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించనుంది. గోల్డ్‌మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీతో పాటు మరో 20 బ్యాంకులు ఈ ఐపీఓ ప్రక్రియను నడిపించాయి.
