రిలయన్స్ జియో కస్టమర్లకు కొత్త అలర్ట్స్ వాస్తున్నాయనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మొబైల్ రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత కూడా రీఛార్జ్ చేసుకోకుండా ఉంటే ఎప్పుడైనా ఇన్‌కమింగ్ కాల్స్ నిలిచిపోయే అవకాశం ఉందంటూ కొంతమంది జియో యూజర్లు చెబుతున్నారు. ఈ మేరకు జియో నుంచి అలర్ట్స్ తో SMSలు వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో రీఛార్జ్ గడువు ముగిసిన తర్వాత ఫోన్‌కు వచ్చే కాల్స్ కూడా ఆగిపోతాయా ? ఎన్ని రోజులు రీఛార్జ్ చేయకుండా ఉండవచ్చు ? సిమ్ పూర్తిగా డీయాక్టివేట్ అవుతుందా ? అనే సందేహాలు కస్టమర్లల్లో మొదలయ్యాయి.
రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే కాల్స్ ఆగిపోతాయా?
సాధారణంగా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత కస్టమర్లకు అవుట్‌గోయింగ్ కాల్స్, SMS సేవలు నిలిచిపోతాయి. అయితే ఇన్‌కమింగ్ కాల్స్ విషయంలో వేరేలా ఉంటుంది. ప్లాన్ గడువు ముగిసిన.. కొన్ని రోజుల పాటు ఇతరుల నుంచి కాల్స్, మెసేజ్‌లు వచ్చే అవకాశం ఉంటుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జియో SMS
Xలో ఓ యూజర్ జియో నుంచి వచ్చినట్లు చెబుతున్న ఒక SMS స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అందులో మీ రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిందని, ఇన్‌కమింగ్ కాల్స్ ఎప్పుడైనా ఆగిపోవచ్చని, సేవలు కొనసాగాలంటే వెంటనే రీఛార్జ్ చేసుకోవాలని సూచించినట్లు ఉంది. సాధారణంగా టెలికాం సంస్థలు కస్టమర్లకు రీఛార్జ్ గడువు ముగిసే ముందు లేదా ముగిసిన తర్వాత రిమైండర్ మెసేజెస్ పంపుతుంటాయి. అయితే ఇక్కడ ఇన్‌కమింగ్ కాల్స్ ఎప్పుడైనా నిలిచిపోవచ్చని చెప్పడం కస్టమర్లల్లో కన్ఫ్యూజన్ కి కారణమైంది.
ముఖ్యంగా రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్‌కమింగ్ కాల్స్ నిలిపివేస్తారా ? లేక కొన్ని రోజుల తర్వాత ఇన్‌కమింగ్ కట్ చేస్తారా ? అనే విషయంపై స్పష్టత లేదు. అంతేకాకుండా ఇన్‌కమింగ్ SMSలు కూడా నిలిచిపోతాయా లేదు అనే వివరాలు కూడా మెసేజులో పేర్కొనలేదు.
జియో రీఛార్జ్ గడువు ముగిస్తే ఏ సేవలు ఆగిపోతాయి?
* రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత అవుట్‌గోయింగ్ కాల్స్ చేయలేరు.
* అవుట్‌గోయింగ్ SMS సేవలు నిలిచిపోతాయి.
* ప్లాన్‌తో వచ్చే మొబైల్ డేటా సేవలు నిలిచిపోతాయి.
* కొన్నిరోజుల పాటు ఇన్‌కమింగ్ కాల్స్ ఉండవచ్చు. అయితే ఎంతకాలం అనేది జియో స్పష్టంగా వెల్లడించలేదు.
అంటే రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే సిమ్ పూర్తిగా పనిచేయడం ఆగిపోదు. కానీ ఇన్‌కమింగ్ సేవలు ఎంతకాలం ఉంటుంది విషయంలో స్పష్టత లేదు.
సిమ్ డీఆక్టివేషన్‌కు 90 రోజుల నిబంధన
ప్రీపెయిడ్ సిమ్ కార్డుల విషయంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది. వీటిలో ముఖ్యమైనది 90 రోజుల కాలపరిమితి. ఈ నిబంధన ప్రకారం ఒక ప్రీపెయిడ్ మొబైల్ నంబర్ 90 రోజుల పాటు ఎలాంటి వినియోగం లేకుండా ఉంటే, అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా టెలికాం సంస్థలు చర్యలు తీసుకోవచ్చు. అయితే రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన రోజు నుంచి 90 రోజులకు సిమ్ డీయాక్టివేట్ అవుతుందని కాదు. నంబర్ ఇన్ యాక్టీవ్ ఉన్న కాలం, అకౌంట్లోని బ్యాలెన్స్, టెలికాం నిబంధనలను బట్టి చర్య ఉంటుంది.
అకౌంట్లో రూ.20 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే ఏం జరుగుతుంది?
జియో నిబంధనలు, షరతుల్లో నంబర్ ఇన్ యాక్టీవ్ ఉన్నప్పుడు అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ ఆధారంగా వేర్వేరు విధానాలను పేర్కొన్నట్లు సమాచారం చెబుతోంది.
రూ.20 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే నంబర్ ఇన్ ఆక్టీవ్ గా మారిన తర్వాత రీఆక్టివేషన్ ఫీజు చెల్లించే వరకు 15 రోజుల పాటు సేవలు నిలిపివేయవచ్చు. ఈ టైంలో ఫీజు చెల్లించకపోతే నంబర్‌ను డిస్‌కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
►ALSO READ | లోన్ కట్టేసినా తాకట్టు తొలగించని బ్యాంక్.. హైదరాబాదీకి రూ.40 లక్షలు ఇప్పించిన కోర్టు!
రూ.20 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే జియో ఆటోమేటిక్ నంబర్ రిటెన్షన్ పద్ధతిని అమలు చేస్తుంది. ఇందులో అకౌంట్ నుంచి రూ.20 మినహాయించి మరో 30 రోజుల పాటు సేవలను కొనసాగించే అవకాశం ఉంటుంది.
ఈ విధానం వల్ల నంబర్‌ను వెంటనే కోల్పోకుండా కొంతకాలం పాటు కొనసాగించుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే దీనికి సంబంధించి తాజా నిబంధనలు, అర్హతలను జియో అధికారిక వెబ్‌సైట్‌లో చూడటం మంచిది.
90 రోజుల నిబంధన ఎప్పటి నుంచి
ప్రీపెయిడ్ మొబైల్ నంబర్ల ఇన్ ఆక్టివ్ సంబంధించిన 90 రోజుల వాలిడిటీని TRAI 2013లో ప్రవేశపెట్టింది. టెలికాం వినియోగదారుల రక్షణ నిబంధనల్లో భాగంగా 2013 ఫిబ్రవరి 21న ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అదే ఏడాది మార్చి 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిబంధన భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లకు వర్తిస్తుంది. అంటే జియోతోపాటు ఇతర నెట్‌వర్క్‌ల యూజర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
జియో యూజర్లు ఏం చేయాలి?
మీ జియో రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిపోయి ఉంటే ఎక్కువ రోజులు అలాగే ఉంచకుండా రీఛార్జ్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా బ్యాంకు అకౌంట్స్, ఓటీపీలు, ఆధార్‌కు సంబంధించిన సేవలు, పర్సనల్ కాంటాక్ట్స్ కోసం ఒకే మొబైల్ నంబర్ ఉపయోగిస్తున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. నంబర్ ఎక్కువకాలం పనిచేయకుండా ఉంటే చివరకు కనెక్షన్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలా జరిగితే అదే నంబర్‌ను తిరిగి తీసుకోవడం కష్టం కావచ్చు.
